పాల్వంచ, నవంబర్ 20 : కార్మికుల హక్కుల కోసం, వారి జీతాల పెంపుదల కోసం బలమైన ఐక్య పోరాటాలు ఉధృతం చేయాలని సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే రమేశ్ అన్నారు. సిఐటియు పాల్వంచ పట్టణ మహాసభ సీఐటీయూ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. పట్టణ మహాసభ ప్రారంభ సూచికంగా సిఐటియు జెండాను సీనియర్ నాయకుడు కామ్రేడ్ కృష్ణమూర్తి ఆవిష్కరించారు. అనంతరం రాజ్యలక్మి, గుర్రం రాములు, గట్టయ్య అధ్యక్ష వర్గంగా మహాసభను నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏజే రమేశ్ మాట్లాడుతూ.. కార్మిక వర్గ హక్కుల కోసం సంక్షేమం కోసం ఐక్య ఉద్యమాలు నిర్మించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలను ఉధృతం చేయాలన్నారు. కార్మిక సంక్షేమాలు గాలికి వదిలేసి, జీతాలు పెంచకుండా, కనీస వేతనాలు అమలు చేయకుండా, కోర్టులు ఎన్ని నిర్ణయాలు చేసినప్పటికీ పాలకవర్గాలు అమలు చేయడం లేదని విమర్శించారు.
అరకొరా జీతాలతో కుటుంబాలు నడవలేక, కనీసం రోజుకి రూ.300 కూలి కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్కీం వర్కర్లు, కాంట్రాక్ట్ వర్కర్లు, ఔట్సోర్సింగ్ వర్కర్ల పేరుతో కార్మికుల శ్రమను దోచుకుంటున్నట్లు తెలిపారు. హక్కుల కోసం పోరాటం చేస్తే జీతాలు పెంచమని, శాంతియుతంగా ఉద్యమాలు కొనసాగిస్తుంటే లాఠీలతో సమాధానం చెబుతున్నారని, అన్యాయంగా కేసులు బనాయించి కోర్టులకు లాగుతున్నారన్నారు. అధికారంలోకి రాకముందు ఒక మాట.. అధికారంలో వచ్చాక మరో మాట మాట్లాడుతూ కార్మికులను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ దొడ్డ రవికుమార్, సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి పి.తులసిరామ్, శ్రామిక మహిళ కె. సత్య, భాను, రమ్య, అచ్చమ్మ, విజయ, చుక్కమ్మ, లక్ష్మి, మహేశ్వరి, వెంకట నరసమ్మ, కుర్మయ్య, రాజేశ్, కేటీపీఎస్ నాయకులు అంకిరెడ్డి నరసింహారావు, శ్రీను పాల్గొన్నారు.