జూలూరుపాడు, మార్చి 31 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సు, ద్విచక్ర వాహనం ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం జూలూరుపాడులోని ఒక ప్రైవేట్ పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు విద్యార్థులను వారి ఇళ్ల వద్ద దింపేందుకు పాపుకొల్లు మీదుగా బేతాళపాడు గ్రామానికి వెళ్తోంది. అదే సమయంలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వలస కూలీలు సంజు, శ్రీరామ్ ఇద్దరు ద్విచక్ర వాహనంపై గుండ్లరేవు గ్రామానికి వస్తున్నారు. గుండ్లరేవు సమీపంలోకి రాగానే, ఎదురెదురుగా వస్తున్న బస్సు, బైక్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదం ధాటికి ద్విచక్ర వాహనం నుజ్జునుజ్జు కాగా, యువకులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. ఈ ప్రమాదంలో శ్రీరామ్ అనే యువకుడికి శరీర భాగాల్లో తీవ్ర గాయాలు కాగా, సంజుకు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి బాధితులను చికిత్స నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రీరామ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ప్రమాదానికి గురైన యువకులు మధ్యప్రదేశ్ నుండి వచ్చి బేతాళపాడులో గుడారాలు వేసుకుని కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బతుకుదెరువు కోసం వచ్చి రోడ్డు ప్రమాదం బారిన పడటంతో తోటి కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.