జూలూరుపాడు, మార్చి 25 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని బేతాళపాడు పెద్దవాగు బ్రిడ్జి వద్ద మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. 30 మంది కూలీలతో వెళ్తున్న ట్రాలీ ఆటో బ్రిడ్జి పైనుంచి అదుపుతప్పి వాగులో పడింది. ఈ ప్రమాదంలో 30 మంది కూలీలకు గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఒకరిని వరంగల్, మరొకరిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటన వివరాలు.
జూలూరుపాడు మండల పరిధిలోని చీపురుగూడెం, టాక్యతండా, ఎలకలోడ్డు, బాడవపోలు గ్రామాలకు చెందిన 30 మంది కూలీలు ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలోని రాజుపాలెం గ్రామంలో మొక్కజొన్న కోసేందుకు మంగళవారం ఉదయం ట్రాలీ ఆటోలో బయల్దేరారు. బేతలపాడు సమీపంలోని పెద్దవాగుపై ఉన్న బ్రిడ్జి వద్దకు రాగానే ప్రమాదవశాత్తు ఆటో అదుపుతప్పి బ్రిడ్జి పైనుండి వాగులోకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బేతాళపాడు సమీప గ్రామాలకు చెందిన సోడెం రాజశేఖర్, సోమయ్య, ప్రభు, బత్తుల అజయ్, లక్ష్మణ్ తో పాటు మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పెద్దవాగుపై ఉన్న బ్రిడ్జి ప్రమాదభరితంగా మారింది. బ్రిడ్జిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా బ్రిడ్జికి ఇరువైపులా కనీసం హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయలేదు. దీంతో పాటు లో లెవెల్ బ్రిడ్జికి ఇరువైపులా రైలింగ్ లేకపోవడం తరచూ ప్రమాదాలకు కారణం అవుతోందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడం అటుంచితే కనీసం హెచ్చరిక బోర్డులను అధికారులు ఏర్పాటు చేయకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్రిడ్జి మూలమలుపు వద్ద ఉండడం దీనికి తోడు దిగువ భాగంలో ఉండటం వల్ల తరచు ప్రమాదాలు జరుగుతున్నట్లు వాహనదారులు వెల్లడించారు. రాత్రి సమయాల్లో ఈ బ్రిడ్జిపై ప్రయాణం మరింత ప్రమాదంగా తయారైందని ప్రయాణికులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా బ్రిడ్జికి ఇరువైపులా ప్రమాద హెచ్చరిక బోర్డులు, రెయిలింగ్ ఏర్పాటు చేయాలని, బ్రిడ్జి ఎత్తును పెంచాలని, బ్రిడ్జి వద్ద లైటింగ్ సౌకర్యం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
Road Accident : బేతాళపాడు పెద్దవాగు బ్రిడ్జి పైనుంచి పడ్డ ట్రాలీ ఆటో.. 30 మంది కూలీలకు గాయాలు