కొత్తగూడెం అర్బన్, జులై 07 : రాష్ర్ట ప్రభుత్వం షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ చట్టం కింద పని గంటలను పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు కార్మిక సంఘాల నాయకులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి జీఓ కాపీలను తగులబెట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ సర్కార్ కార్మికుల హక్కులను హరించే విధంగా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను, రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పని గంటల పెంపును తక్షణమే ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు.
వాణిజ్య సంస్థలో పనిచేసే ఉద్యోగులతో, కార్మికులతో 10 గంటలు పని చేయించుకోవచ్చని, వారానికి 48 గంటలు మాత్రమే పని కల్పించాలని, అది దాటితే ఓటి చెల్లించాలని ఉందన్నారు. ఈ జీఓ వల్ల వాణిజ్య సంస్థలు లాభం పొందుతాయి కానీ అందులో పని చేసే కార్మికులకు ప్రయోజనం లేదన్నారు. పైగా మరింత శ్రమదోపిడికి గురవుతారనీ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోదీని ఒకవైపు విమర్శిస్తూనే మరో వైపు కేంద్రం తీసుకువచ్చిన కార్మిక చట్టాలను అమలు చేయడంలో భాగంగానే పని గంటల పెంపు విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడంపై బడే భాయ్ చోటే బాయ్ ఇద్దరు ఒకటేనని తేలిపోయిందని ధ్వజమెత్తారు.
పని గంటల పెంపు వల్ల కార్మికులు ఒత్తిడికి గురవుతారని, దీనివల్ల అనేక మానసిక శారీరక సమస్యలు వస్తాయనీ కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాన్ని ఉపసంహరించాలని లేనిపక్షంలో దశల వారీగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలకు శ్రీకారం చూడతామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐటీయూసీ, బీఆర్టీయూ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ రాష్ర్ట నాయకులు ఐ.కృష్ణ, బండి నాగేశ్వరరావు, శంకర్ రెడ్డి, ఏ జే.రమేశ్, జిల్లా నాయకులు సారంగపాణి, గౌని నాగేశ్వరరావు, నమిళ్ల సంజీవ్, దొడ్డా రవికుమార్, సత్య, గెద్ధాడి నగేశ్, నారాయణ, మల్లికార్జున్, లక్ష్మి, శ్రీమన్నారాయణ, పావని, విజయ పాల్గొన్నారు.
Kothagudem Urban : పెంచిన పని గంటలను రద్దు చేయాలని కార్మిక సంఘాల నిరసన