రామవరం, మే 21 : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం అమలులో దళారులను కట్టడి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా బుధవారం ఒక ప్రకటనలో జిల్లా కలెక్టర్‌ను కోరారు. రాజీవ్ యువ వికాస పథకం కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వద్దకు దళారులు వెళ్లి తమకు కమీషన్ ఇస్తే పక్కాగా లోన్ వచ్చేలా చేస్తామని ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.
ఈ నేపథ్యంలో లబ్ధిదారులకు నగదు నేరుగా వారి ఖాతాలోకి బదిలీ అయ్యేలా చేసి, దళారుల ఆట కట్టించాలన్నారు. లేనిపక్షంలో ప్రభుత్వం లక్ష్యాన్ని అందుకోలేదని, నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరిగేలా ఉందన్నారు. యూనిట్ల మంజూరులో, లబ్ధిదారుల ఎంపికలో కీలకంగా వ్యవహరిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులకు తగిన విధంగా ఆదేశాలు జారీ చేయాలని లేఖలో పేర్కొన్నారు.