ఇల్లెందు, మార్చి26 : ఏజెన్సీ గిరిజన ప్రాంతాలకు గోదావరి నీళ్లు రాకుండా రాష్ట్ర మంత్రులు ముగ్గురు జల దోపిడి చేస్తున్నట్లు సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆవునూరు మధు అన్నారు. గోదావరి జలాలను రోల్లపాడులో నింపి సీతారామ ప్రాజెక్ట్ రిజర్వాయర్‌ను నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం ఇల్లందు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
గత ముఖ్యమంత్రి కేసీఆర్ రోల్లపాడు ప్రాజెక్ట్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసి భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు గోదావరి నీళ్లు అందించి ఏజెన్సీ ప్రాంతాలను సస్యశ్యామలం చేద్దామనే ఉద్దేశంతో ప్రాజెక్టును ప్రారంభించినట్లు తెలిపారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ ముగ్గురు మంత్రులు ఏజెన్సీ ప్రాంతాలకు నీళ్లు రాకుండా, సాగర్ నీళ్లు ఉన్న ప్రాంతానికి మళ్లీ గోదావరి నీళ్లు తరలించకపోతున్నట్లు తెలిపారు.
ఏజెన్సీ ప్రాంతాలకు అన్యాయం చేసి నీళ్లు ఉన్న మైదాన ప్రాంతానికి మళ్లీ నీళ్లు తరలించకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ముగ్గురు మంత్రులు కలిసి చేసే ఈ అన్యాయమైన పనిని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. రోల్లపాడులో గోదావరి నీళ్లు నింపి సీతారామ రిజర్వాయర్ నిర్మించాలని, బయ్యారం చెరువుని మినీ రిజర్వాయర్‌గా ఏర్పాటు చేయాలన్నారు. లేనియెడల దశలవారీగా పోరాటానికి సిద్ధమవుతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ నాయకులు అవునూరి మధు, తుపాకుల నాగేశ్వరరావు, పొడుగు నరసింహరావు, సారంగపాణి, హార్జ్య, కల్తీ వెంకటేశ్వర్లు, రాసుద్దీన్, తోడేటి నాగేశ్వరరావు, సూర్ణపాక నాగేశ్వరరావు పాల్గొన్నారు.