పాల్వంచ, ఏప్రిల్ 03 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని వేలం వేయడాన్ని ఆపి ఆ భూమిని తిరిగి యూనివర్సిటీకే అప్పగించాలని బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకురాలు హిందుత్ తపస్వి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధిష్టానం పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆదేశాలతో బీఆర్ఎస్ యువజన విభాగం, బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో గురువారం పాల్వంచ పట్టణంలోనీ అంబేద్కర్ సెంటర్లో ధర్నా, నిరసన కార్యక్రమం చేపట్టారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా అంబేద్కర్ కూడలిలో బైఠాయించి హైచ్సీయూ పట్ల ప్రభుత్వ మొండి వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆందోళనలను అణిచివేయాలనే ఉద్దేశ్యంతో విద్యార్థులపై అక్రమ కేసులు బనాయించి జైలుపాలు చేస్తున్నారని వెంటనే దీన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, అలాగే పెట్టిన కేసులను ఎత్తేయాలన్నారు. విద్యార్థులు, ప్రజాభిష్టం మేరకు ప్రభుత్వం నడుచుకుని యూనివర్సిటీ భూములు యూనివర్సిటీకే ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకురాలు సింధు తపస్వి, బీఆర్ఎస్వీ జిల్లా నాయకులు అఖిల్, మహర్షి, హసీబ్, బీఆర్ఎస్ జిల్లా యువజన నాయకులు వెలదండి రాజేశ్, అబ్దుల్, రాకేశ్, గణేశ్, విజయ్, రోహిత్, సాయిచరణ్, సాయి, వినయ్ పాల్గొన్నారు.