కొత్తగూడెం అర్బన్, జూన్ 14 : ప్రజా పాలన అంటూ ప్రచారం చేసుకుంటున్న రేవంత్ సర్కార్‌ది నయవంచక పాలన అని బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, జిల్లా మాజీ అధ్యక్షుడు దిండిగల రాజేందర్, భద్రాచలం పార్టీ ఇన్చార్జి రామకృష్ణ అన్నారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో పట్టణ, మండల అధ్యక్ష, కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై చర్చించి మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 వాగ్దానాలను నెరవేర్చే దాకా ప్రభుత్వంపై ఉద్యమాలు చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అస్తవ్యస్తమని, సీతారామ ప్రాజెక్టు నీళ్ల విషయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పూర్తి అన్యాయం జరిగిందన్నారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టీ వేధిస్తోందని, ఎన్ని కేసులు పెట్టిన అదిరేది బెదిరేది లేదన్నారు. మాజీ సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విచారణల పేరుతో వేధించడం వల్ల ఒరిగేదేమి లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలో భాగంగానే కేటీఆర్‌కు రెండోసారి ఏసీబీ నోటీసులు ఇచ్చారని దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. సీతమ్మ బరాజ్ తో జిల్లా రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని డిమాండు చేశారు.
ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నపటికీ జిల్లా రైతులకు, ప్రజానీకానికి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం ఇటీవల అనారోగ్యంతో మరణించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ శ్రీమతి కాపు సీతామహాలక్ష్మి, పార్టీ అన్ని అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు, ఐదు నియోజకవర్గాల ముఖ్య నాయకులు, అన్ని మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.