రామవరం, డిసెంబర్ 02 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం కొత్తగూడెం పర్యటన నేపథ్యంలో ఆరు గ్యారంటీల అమలుపై ఎక్కడ ప్రశ్నిస్తారో అని బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అప్రజాస్వామిక పాలనకు పరాకాష్ట అని ఆ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తమ హక్కుల సాధన కోసం, ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజలు ప్రశ్నిస్తే జీర్ణించుకోలేక పోతున్నట్లు తెలిపారు. ప్రశ్నించిన వారిపై కక్షతో అక్రమ కేసులు పెట్టి లోపల వేస్తాం అన్న తీరుగా కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని దుయ్యబట్టారు. ఇది ప్రజాపాలన కాదు నిర్బందపు, నిరంకుశ పాలన అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, కాంగ్రెస్ సాగిస్తున్న ఈ రాక్షస పాలనకు అంతం పలికే రోజు త్వరలోనే వస్తుందన్నారు. గృహ నిర్బంధం చేసిన, అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులను బేషరతుగా తక్షణమే విడుదల చేయాలి ఆయన డిమాండ్ చేశారు.