ఆళ్లపల్లి, ఆగస్టు 12 : ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ సిగ్నల్ సమస్య పరిష్కరించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి, మర్కోడ్ అలాగే పరిసర 41 గ్రామాల వినియోగదారులు కోరుతున్నారు. ఆళ్లపల్లి, మర్కోడు, రఘావాపురం, రామంజిగూడెం గ్రామాల్లో బీఎస్ఎన్ఎల్ టవర్స్ ఉన్నాయని, సుమారు 3 వేలకు మందికి పైగా వినియోగదారులు ఈ నెట్వర్క్ సేవలను వినియోగిస్తున్నారని, అయితే సిగ్నల్స్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వారు వాపోయారు. కరెంట్ పోతే సిగ్నల్స్ పోతున్నాయని, జనరేటర్లు ఉండి అధికారుల నిర్లక్ష్యంతో నిర్వహణ లేక టవర్స్ లో కరెంట్ పోయినప్పుడు సిగ్నల్స్ పోతున్నట్లు తెలిపారు. ఒక్కోసారి నాలుగైదు రోజులైనా సిగ్నల్స్ రావడం లేదని, రీఛార్జ్ నగదు వృథాగా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఎస్ఎన్ఎల్ అధికారులు స్పందించి సిగ్నల్ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.