టేకులపల్లి. జనవరి 05 : మరో మూడు నెలల్లో తమ కుటుంబంలోకి శిశువును ఆహ్వానించి సంతోషాలతో నిండాల్సిన ఆ ఇళ్లు ఒక్కసారిగా విషాద భరితమైంది. బైక్ అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టి కిందపడిన ఘటనలో ఓ యువకుడు మృతిచెందాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం రోళ్లపాడు సమీపంలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. టేకులపల్లి ఎస్ఐ అలకుంట రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. 9వ మైల్ తండాకు చెందిన గుగులోత్ అశోక్ (28) తన స్వగ్రామానికి బైక్పై వస్తుండగా రోళ్లపాడు సమీపంలో అదుపుతప్పి కల్వర్టును ఢీకొని కిందపడ్డాడు. దీంతో తీవ్ర గాయాలతో సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. తల్లిదండ్రులు భద్రు, జ్యోతికి అశోక్ ఒక్కడే కుమారుడు. ఏడాది క్రితమే వివాహం అయింది. భార్య ఆరు నెలల గర్భిణి. టేకులపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తండ్రి గుగులోత్ భద్రు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.