రామవరం, జూన్ 3 : తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా సింగరేణి కొత్తగూడెం ఏరియాలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించేందుకు వచ్చిన ప్రజలకు నిరాశే మిగిలింది. కన్వీనర్‌గా జీవి కోటిరెడ్డి ఆధ్వర్యంలో గత పది రోజులుగా వేడుకలకు సంబంధించి సమీక్షా సమావేశాలు జరిగాయి. వేడుకలను ఘనంగా నిర్వహించాలని పేర్కొంటూ, కార్యక్రమాల నిర్వహణపై ఏరియాలోని అధికారులకు ఆయన దిశ నిర్దేశం చేశారు.
వేడుకల్లో భాగంగా సేవ మహిళలకు ఆటల పోటీలను నిర్వహించారు. ఉదయం నిర్వహించిన కార్యక్రమాలు సజావుగా, సాఫీగా సాగాయి. ఆటోకు మైక్ కట్టుకుని ప్రచారం చేయడంతో రాత్రి నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించేందుకు రుద్రంపూర్, గౌతమ్‌పూర్, ధన్‌బాద్, మాయాబజార్, రామవరం, త్రీ ఇంక్లైన్, 4 ఇంక్లైన్, పెనగడప రాంపురం పంచాయతీల నుండి ప్రజలు రుద్రంపూర్ ప్రగతివనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతుండగా ఒక్కసారిగా వర్షం పడడంతో అంతా రసాభాసగా మారిపోయింది. గతేడాది ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఇదే పరిస్థితి ఎదురైంది. దీనిని దృష్టిలో పెట్టుకుని సభ నిర్వహించే ప్రాంతంలో వేసిన పెండల్స్ (టెంటు మాదిరి) పైన వాటర్ ప్రూఫ్ కవర్‌ను కప్పకపోవడంతో వేడుకలను తిలకించేందుకు వచ్చిన చిన్నా, పెద్దా, మహిళలు, వృద్ధులు వర్షంలో తడిసిపోవాల్సి వచ్చింది. ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు దంపతులు గొడుగును చేత పట్టుకొని కార్యక్రమాలను వీక్షించారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
గతంలో జరిగిన పొరపాటును సరిచేసుకోకపోవడం, కొంతమంది అధికారుల నిర్లక్షంతో వీక్షకులంతా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇప్పటికైనా అధికారులు దీనిని ఒక పాఠంగా స్వీకరించి భవిష్యత్‌లో ఇలాంటి తప్పిదాలు మరలా జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, కార్మిక సంఘాల నాయకులు అంటున్నారు.