– రూ.13.50 లక్షలకు దక్కించుకున్న మూడ్ వాసు
టేకులపల్లి, మార్చి 23 : టేకులపల్లి మండల కేంద్రంలో టేకులపల్లి, గోలియా తండా పంచాయతీల ఆధ్వర్యంలో శ్రీ కోదండ రామాలయం ప్రాంగణంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న వారాంతపు సంత వేలం పాట గోల్యతండా పంచాయతీ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. గతంలో సంత రూ.11.60 లక్షలు పలుకగా ఈ ఏడాది రూ.13.50 లక్షలు పలికింది. టేకులపల్లి గ్రామానికి చెందిన మూడ్ వాసు సంతని వేలంపాటలో దక్కించుకున్నారు. సంత ఆదాయం అభివృద్ధికి వాడాలని, ఆదాయం ఉన్నా కూడా వారసంత నిర్వహణ, వసతుల కల్పనలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, సమస్య పరిష్కరించే వరకు సంత వేలం పాట నిర్వహించకూడదని గోలియా తండా వాసి పేర్కొన్నాడు.
సంతలో ఎలాంటి వసతులు లేకపోవడంతో ఎండకు ఎండి, వానకు తడిచి పోతున్నామని విక్రయదారులు వాపోయారు. సంతలో ఉన్న భూమి వివాదాల్లో ఉందని, దానిని పరిష్కారం చేయాలన్నారు. దీనిపై అధికారులు, సర్పంచులు స్పందిస్తూ గ్రామ పంచాయతీ కార్యాలయంలో మాట్లాడదామని కమిటీలు ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ జక్కుల గణేష్ గాంధీ, టేకులపల్లి సర్పంచ్ బోడ బాలు నాయక్, గోలియతండా సర్పంచ్ లకావత్ నాకా నాయక్, టేకులపల్లి, గోలియాతండ కార్యదర్శులు శోభన్, ప్రశాంత్ పాల్గొన్నారు.

టేకులపల్లి వారాంతపు సంత వేలం పాట