మణుగూరు రూరల్, మే 13 : విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయుడే వక్ర బుద్ధిని ప్రదర్శించాడు. విద్యార్థినులతో అసభ్యంగ ప్రవర్తించడంతో డీఈవోకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే..భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన పదోతరగతి విద్యార్థినులు ఇదే పాఠశాలలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు తమతో అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నాడని డీఈవో సోమశేఖరశర్మకు ఫిర్యాదు చేశారు.
ఈ విషయం శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో సామాన్యశాస్త్రం బోధిస్తున్న ఉపాధ్యాయుడు అభ్యంతకరంగా ప్రవర్తిస్తున్నాడని, అకారణంగా పరుష పదజాలంతో దూషించినట్లు తెలిసింది. విద్యార్థినులు హెచ్ఎం లక్ష్మీనారాయణ పటేల్‌తో పాటు డీఈవోకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై ‘నమస్తే’ హెచ్ఎంను వివరణ కోరగా విద్యార్థులు ఫిర్యాదు చేసిన మాట నిజమేనని, ఫిర్యాదుపై డీఈవో విచారిస్తున్నారని సమాధానం ఇచ్చారు.