ITDA PO Rahul | పాల్వంచ, ఫిబ్రవరి 24 : పదవ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థిని విద్యార్థులలో దాగివున్న నైపుణ్యాలను వెలికి తీసి భవిష్యత్తులో కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి ప్రతిభా ప్రోత్సాహ పరీక్షలు గిరిజన పిల్లల జీవితానికి తొలిమెట్టు అని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
పాల్వంచలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ప్రతిభా ప్రోత్సాహ పరీక్ష కేంద్రాన్ని ఇవాళ ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ సందర్శించారు. పిల్లలు పరీక్షలు రాస్తున్న విధానాన్ని పరిశీలించారు. విద్యార్థినీ విద్యార్థులకు కొన్ని సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదవ తరగతి పూర్తి అయిన తర్వాత పైచదువులు చదవడానికి మీరు ఎన్నో రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయవలసి ఉంటుందని.. ఆ పరీక్షలు సులభంగా రాయడానికి ఈ ప్రతిభా ప్రోత్సాహ పరీక్షలు ఎంతో దోహదపడతాయని అన్నారు.
సంబంధిత ఉపాధ్యాయులు, స్పెషలాఫీసర్లు పిల్లలు వారేసొంతంగా వారి మేధాశక్తికి పదును పెట్టి పరీక్షలు రాసేలా చూడాలని, ఎవరూ వారికి సహకారం అందించవద్దని అన్నారు. గ్రూప్ పరీక్షలు ఎంత పగటి బందీగా నిర్వహిస్తామో.. ఆ విధంగా ప్రతిభ ప్రోత్సాహ పరీక్షలు నిర్వహించాలని స్క్వాడ్, స్పెషలాఫీసర్ ఏటీడీఓ అశోక్‌ను ఆదేశించారు.
ఈ పరీక్షలు రాయడం వలన విద్యార్థిని విద్యార్థులకు జేఈ, నీట్, ఎంసెట్ ఇతర కాంపిటేటివ్ ఎంట్రెన్స్ రాయడానికి ఎంతో ఉపకరిస్తాయని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీ తెలివితేటలను రంగరించుకొని ఈ పరీక్షలు బాగా రాసి మంచి మెరిట్ తెచ్చుకోవాలని సూచించారు. మెరిట్ తెచ్చుకున్న విద్యార్థినీ విద్యార్థులకు పై చదువులకు తప్పనిసరిగా ఐటిడిఏ ద్వారా సహకారం అందిస్తామని అన్నారు.
అనంతరం పిల్లల స్టడీ అవర్స్ క్లాసును పరిశీలించి పిల్లలు వెనుకబడ్డ సబ్జెక్టులలో ఎవరు ఉన్నారో వారిని గుర్తించి వారు బాగా చదివేలా సంబంధిత సబ్జెక్టు టీచర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. వారు చదివే విధివిధానాలను హెచ్ఎం పరిశీలించి సబ్జెక్ట్ టీచర్లు స్టడీ అవర్స్ సక్రమంగా జరిగేలా సూచనలు సలహాలు ఇచ్చి పరీక్షలలో మంచి ఫలితాలు వచ్చేలా చూడాలని అన్నారు.
అనంతరం పాఠశాలలో జరుగుతున్న ఇంజనీరింగ్ మైనర్ రిపేర్ పనులను పరిశీలించి టాయిలెట్, బాత్రూంలు, మైనర్ రిపేర్లు పనులు నాణ్యతగా ఉండేలా చేయించుకోవాలని హెచ్ఎంకు సూచించారు. ప్రతిభ ప్రోత్సాహ పరీక్షలకు 50 మంది విద్యార్థినీ విద్యార్థులకుగాను 48 మంది హాజరయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం బద్రు మరియు సంబంధిత ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.