రామవరం, ఆగస్టు 22 : ఎంపీసీ, బైపీసీ పూర్తి చేసిన యువతీ, యువకుల కోసం రాష్ట్ర ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెంలోని డా. మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీలో ఈ ఏడాది నుండి ప్రవేశ పెడుతున్న బీఎస్సీ (జియాలజీ), బీఎస్సీ (ఎన్విరాన్మెంటల్ సైన్స్) డిగ్రీ కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ.యాకూబ్ పాషా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారతదేశంలోనే మొట్ట మొదటిసారిగా స్థాపించబడిన ఈ యూనివర్సిటీలో మూడేండ్ల డిగ్రీ ప్రవేశాలు పొందే విద్యార్థులకు ఉచిత హాస్టల్ సౌకర్యం, పారిశ్రామిక సందర్శనలు, లైబ్రరీ, ల్యాబ్లు, విశాలమైన తరగతి గదులు, నిష్ణాతులైన అధ్యాపకులతో బోధన జరుగుతుందన్నారు.
కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మన దేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అలాగే మైనారిటీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆసక్తి కలిగిన విధ్యార్థులు ఈ నెల 26వ తేదీ వరకు యూనివర్సిటీలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాల కోసం 99851 37137, 85003 78531 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.