రామవరం, జూన్ 13 : వారాల లోన్లు ఇచ్చి వసూలు చేసుకునే క్రమంలో మహిళలని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ, వీడియోలు తీస్తూ, అసభ్యకర పదజాలాలతో దూషిస్తున్న మైక్రో బ్యాంక్‌లపై చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ కంచర్ల జమలయ్య జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని రామవరంలో ఏడు వార్డుల పరిధిలో ఉన్న మహిళలని ఇబ్బంది పెడుతున్న మైక్రో ఫైనాన్స్ సంస్థలైన బందన్ బ్యాంక్, అన్నపూర్ణ బ్యాంక్, బీఆర్ఎల్ బ్యాంక్, డబల్ ఎక్స్ ఎల్ బ్యాంక్, యూనిటీ బ్యాంక్, తిరుమల బ్యాంక్‌లు లోన్లు, కమీషన్ల పేరుతో ఇబ్బందులు పెడుతున్నట్లు తెలిపారు.
ఇటువంటి ప్రైవేట్ బ్యాంక్‌లపై రాష్ట్రం ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని కోరారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వారి ఇబ్బందులు తాళలేక ఇటీవలే ఓ మహిళ ఉరి వేసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు, భూక్య శ్రీనివాస్, కనుకుంట్ల శ్రీనివాస్, సనప వీరభద్రం, మహిళా సమైక్య నాయకురాలు ధార లక్ష్మి, అన్నపూర్ణ, సుభద్ర, సుగుణ, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.