జూలూరుపాడు, ఏప్రిల్ 09 : బడా కార్పోరేట్ శక్తులకు దన్నుగా నిలుస్తూ దేశంలోని సామాన్యులు, పేదలపై పన్నులతో విరుచుకు పడడమే ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ పాలన తీరు అని సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ ప్రజాపంథా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గ సభ్యుడు చాటు కృష్ణ అన్నారు. సామాన్యుల నడ్డి విరిచేలా గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి ప్రజలపై భారం మోపడాన్ని నిరసిస్తూ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం జూలూరుపాడు మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ 11 ఏళ్లుగా సంపన్నులైనా కార్పొరేట్లకు కొమ్ముగాస్తు దేశ ప్రజలు ముఖ్యంగా పేదలపై ధరలు, పన్నులతో విరుచుకుపడుతున్నట్లు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా చమురు-క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గినా ఇక్కడ పెట్టుబడిదారులకు వత్తాసు పలుకుతూ పెట్రోల్, వంట గ్యాస్ ధరలు పెంచడం దారుణమన్నారు. మతం మత్తులో దేశ ప్రజలను ముంచి తుగ్లక్ ను మించిన మతిలేని పరిపాలన చేస్తున్నాడని విమర్శించారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఆకలి, పేదరికం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలను పట్టించుకోకుండా, పరిష్కరించకుండా మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ధరలను పెంచుతూ పోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు మండల కార్యదర్శి బానోతు ధర్మ, జిల్లా నాయకుడు గోపాల్‌రావు, మండల నాయకులు రాయల సిద్దు, తోటకూరి నరసింహారావు, లింగాల వీరభద్రం, ఇరప రాజు, కల్తీ నాగేశ్వర్రావు, పైద ధనమ్మ, ఇరప పుష్ప, అనసూర్య, కల్తీ శేఖర్, రమాదేవి, సాగర్, సాయి రంజిత్, రాజేశ్, నరేశ్, భూక్య రాంబాబు, రమేశ్ పాల్గొన్నారు.