కొత్తగూడెం టౌన్, జూన్ 19: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సుజాతనగర్ ఎస్ఐ రమాదేవి (SI Ramadevi) అన్నారు. ఎవరైనా ఇలాంటి మోసాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పటని హెచ్చరించారు. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమతంగా ఉండి, వారి వ్యక్తిగత వివరాలను, బ్యాంక్ అకౌంట్, పిన్ నంబర్, ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే వంటి ఆన్లైన్ ట్రాన్జాక్షన్స్ సంబంధించిన పిన్ నంబర్, వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. సుజాతనగర్లో ఫ్యాన్సీ షాప్ నిర్వహిస్తున్న ధరావత్ కైక అనే మహిళను నమ్మించి మోసం చేసిన ముగ్గురు వ్యక్తులు.. ఆమె ఫోన్లో ఫోన్ పే యాప్ ద్వారా రూ.30 వేలు బదిలీ చేసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు.. ఖమ్మంకు చెందిన షేక్ అన్వర్, చిలక ప్రవీణ్ కుమార్ను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సుజాతానగర్ ఎస్ఐ రమాదేవి మాట్లాడుతూ.. మరో నిందితుడు గొడుగు సంపత్ పరారీలో ఉన్నాడన్నారు. అతన్ని కూడా త్వరలో పట్టుకొని, జైలుకు పంపిస్తామని తెలిపారు.
ఎవరైనా ఇలాంటి సైబర్ నేరాలకు పాల్పడితే వాళ్లకు కఠినమైన శిక్ష పడుతుందన్నారు. ఈ కేసు దర్యాప్తును చుంచుపల్లి సీఐ రాయల వెంకటేశ్వర్లు నేతృత్వం వహిస్తున్నారన్నారు. ఎవరైనా సైబర్ నేరాలకు గురి అయితే, 24 గంటలలోపు సైబర్ పోర్టల్ ద్వారా గాని, పోలీస్ స్టేషన్కు నేరుగా గాని, టోల్ ఫ్రీ నెంబర్ 1930 ద్వారా గాని రిపోర్టు చే చేయాలని కోరారు.