ఇల్లెందు, సెప్టెంబర్ 19 : ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం పెట్టాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యా శాఖ కో ఆర్డినేటర్ ఎస్కే. సైదులు నిర్వాహకులకు సూచించారు. శుక్రవారం ఇల్లెందు పట్టణం జేబీఎస్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించి పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పాఠశాల ఆవరణలోని భవిత కేంద్రాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న భవన రిపేర్లను, టాయిలెట్స్ రిపేర్ పనులను పరిశీలించారు. జిల్లాలోని 17 మండలాల్లో నూతన భవిత కేంద్రాల నిర్మాణాలు జరుగుతున్నాయని, అదేవిధంగా 6 పాత భవిత కేంద్రాల్లో మరమ్మతు పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు.
జిల్లాలోని 40 పాఠశాలల్లో దివ్యాంగులకు ప్రత్యేకంగా మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టినట్లు వెల్లడించారు. దివ్యాంగ విద్యార్థుల కోసం భవిత కేంద్రాలను నిర్వహిస్తున్నామని, ప్రత్యేకంగా ఫిజియోథెరపిస్ట్ లతో ఫిజియోథెరపీ సేవలను వారానికి రెండుసార్లు అన్ని మండలాల్లో అందజేయనున్నట్లు చెప్పారు. ఈ సౌకర్యాన్ని దివ్యాంగ బాలలు వినియోగించుకునేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు శ్రద్ద చూపాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం ఎం.రాజేంద్రప్రసాద్, ఎడ్యుకేషన్ విభాగం అసిస్టెంట్ ఇంజినీర్ యూసుఫ్, ఉపాధ్యాయులు, సమ్మిళిత విద్య రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు.