కొత్తగూడెం సింగరేణి, జనవరి 24 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న సింగరేణి ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అలాగే ఉమెన్స్ కాలేజీలో చదువుకున్న విద్యార్థినులకు రవాణా సౌకర్యం కల్పించేందుకు సింగరేణి యాజమాన్యం 5 బస్సులను ఏర్పాటు చేసింది. పాఠశాలకు సంబంధించిన విద్యార్థులను సమయానికి వివిధ ప్రాంతాల నుండి స్కూల్ కి తీసుకురావడం, సాయంత్రం వారి వారి ఏరియాలో దింపడం చేస్తుంటారు. అదేవిధంగా ఉమెన్స్ కాలేజీ విద్యార్థులను కూడా తీసుకురావడం తిరిగి వారి ప్రాంతాల్లో దింపడం కోసం ఐదు బస్సులను కాంటాక్ట్ పద్ధతిన నడిపేందుకు గుత్తేదారుడికి అప్పజెప్పారు. కొన్ని సంవత్సరాలుగా బస్సులను నడిపిస్తున్న కాంట్రాక్టర్ యాజమాన్యానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గత నెల రోజులుగా బస్సులను నడపడం లేదు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పాఠశాల విద్యార్థులు అయితే సాయంత్రం స్కూల్ విడిచి పెట్టే సమయానికి ఏ పనుల్లో ఉన్న ఆయా విద్యార్థుల తల్లిదండ్రులు స్కూలు వద్దకు వచ్చి వారిని తీసుకువెళ్లడం తీవ్ర ఇబ్బందిగా మారింది. ఆ సమయానికి ఏ పనుల్లో ఉన్న స్కూలు వద్దకు రావడం కుదరకనే బస్సు సౌకర్యాన్ని ఎంచుకున్న తల్లిదండ్రులకు నెల రోజులుగా బస్సులు లేకపోవడం వల్ల ఉదయం, సాయంత్రం స్కూలుకు తీసుకురావడం, తీసుకువెళ్లడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి యాజమాన్యం తమ టెండర్ పూర్తి కాకుండానే బస్సులను నిలిపివేయడం ఏమిటని కాంట్రాక్టర్ను ఆరా తీయగా బస్సులకు సంబంధించిన ఫైనాన్స్ వాయిదా కిస్తీ లను చెల్లించకపోవడం వల్ల ఫైనాన్స్ కంపెనీ వారు బస్సులను తీసుకువెళ్లినట్లు తెలిసింది.
సింగరేణి యజమాన్యం నెల నెలా బస్సులకు సంబంధించిన బిల్లులను చెల్లిస్తున్నప్పటికీ కాంట్రాక్టర్ ఫైనాన్స్ వాయిదాలను చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఫైనాన్స్ కంపెనీ బస్సులను సీజ్ చేసిందని, విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన కాంట్రాక్టర్ నిర్లక్ష్య ధోరణికి యాజమాన్యం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందోనని తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. ఈ విషయమై సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ జీఎం వెంకట చారిని వివరణ కోరగా స్కూల్, కాలేజీ బస్సులను ఫైనాన్స్ కంపెనీ తీసుకువెళ్లిన మాట నిజమేనన్నారు. టెండర్ సమయం పూర్తికాక ముందే ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బస్సులను నిలిపివేయడం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం అని తెలుస్తోందని, కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెట్టి భవిష్యత్లో సింగరేణి సంస్థలో ఎలాంటి టెండర్లు వేయకుండా నిలిపి వేస్తామని తెలిపారు. విద్యార్థులకు వీలైనంత త్వరలో బస్సులను సమకూర్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు.

Kothagudem Singareni : సింగరేణి స్కూల్ బస్సులు లేక విద్యార్థులు, తల్లిదండ్రుల ఇబ్బందులు