– అమరజీవి జార్జ్‌కు ఘన నివాళులు
– 35వ వర్ధంతి సభలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు మంద నరసింహారావు
రుద్రంపూర్, మే 14 : కామ్రేడ్ జార్జ్ పోరాటాల స్ఫూర్తితో సింగరేణి సంస్థ, కార్మిక చట్టాల రక్షణకు పోరాటాలు మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ ( సిఐటియు ) రాష్ట్ర అధ్యక్షుడు మందా నరసింహారావు అన్నారు. సిఐటియు వ్యవస్థాపకుడు కామ్రేడ్ జార్జ్ 35వ వర్ధంతి సందర్భంగా రామవరంలోని జార్జ్ స్థూపం వద్ద వర్ధంతి సభ నిర్వహించారు. తొలుత సిఐటియు జెండాను సిఐటియు సీనియర్ నాయకుడు ఎంఎస్.ప్రకాష్ ఆవిష్కరించిన అనంతరం జార్జ్ చిత్రపటానికి పూలమాల వేసి, ఘన నివాళులు అర్పించారు. సిఐటియు బ్రాంచి అధ్యక్షుడు గాజుల రాజారావు అధ్యక్షతన జరిగిన సభా కార్యక్రమంలో మంద నరసింహారావు మాట్లాడారు. సింగరేణిలో సీఐటీయూ కార్మిక సంఘం ఏర్పాటు చేసి, కార్మికుల హక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసిన జార్జి స్ఫూర్తి నేడు చాలా అవసరమని అన్నారు.
సింగరేణి సంస్థ తిరోగమన పరిస్థితిలో ఉందని, సంస్థను కాపాడుకోవడానికి, కార్మికుల హక్కులు రక్షించుకోవడానికి పోరాటాలు తప్పవని తెలిపారు. సింగరేణి లో ప్రస్తుతం కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతున్న పరిస్థితుల్లో జార్జి చూపిన పోరాట స్ఫూర్తిని తీసుకుని కార్మికుల హక్కుల పరిరక్షణకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలను సింగరేణిలో అమలు చేస్తుంటే సింగరేణిలోని గెలుపొందిన కార్మిక సంఘాలు మౌనంగా ఉండడం కార్మిక లోకానికి నష్టదాయకమన్నారు. అన్ని సంఘాలను కలుపుకుని ఐక్య పోరాటాలుచేసి, సింగరేణి సంస్థ, కార్మిక చట్టాలు రక్షించుకోవడానికి ఐక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం న్యాయవాది, ఐలూ రాష్ట్ర నాయకులు రమేష్ కుమార్ మక్కాడ్, రిటైర్డ్ సింగరేణి జిఎం పి. శ్రీనివాసరావు, కే హెచ్. ప్రసాద్ తదితరులు ప్రసంగించారు. జార్జ్ సింగరేణిలో పనిచేస్తున్న కాలంలో బొగ్గు గని కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా, శ్రమ దోపిడీ చేస్తున్న సమయంలో, కార్మికులను ఐక్యం చేసి సిఐటియు యూనియన్ స్థాపించారన్నారు. సుధీర్ఘగా కాలంగా కార్మికుల సమస్యలపై పోరాడిన త్యాగశీలి, నిరాడంబరంగా, నిస్వార్థంగా పనిచేసిన కార్మిక నేత అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బ్రాంచి అధ్యక్షులు గాజుల రాజారావు, వై.వి.రావు, సీనియర్ నాయకులు ఎం.ఎస్. ప్రకాష్, రిటైర్డ్ సింగరేణి జనరల్ మేనేజర్ పి.శ్రీనివాసరావు, నందిపాటి రమేష్, మహ్మద్ అలీ, సూర్యనారాయణ, కొత్తపెల్లి రమేష్ బాబు, ఎలగొండ రఘు, కూరపాటి సమ్మయ్య, గడాల నరసింహారావు, పోశం, పప్పుల వెంకటి, ధనరాజ్ పాల్గొన్నారు.