– కాంట్రాక్టు కార్మిక జేఏసీ వినూత్న నిరసన
బూర్గంపహాడ్, ఏప్రిల్ 01 : ఐటీసీ పీఎస్‌పీడీలో పని చేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ఐటీసీ యాజమాన్యం దిగొచ్చేంత వరకు పోరాట నిరసన దీక్ష ఆగదు.. ఆపేది లేదని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రారెడ్డి, బెల్లం నాగయ్య, ఎండీ.యాకూబ్‌పాషా అన్నారు. బుధవారం 7వ రోజు నిరసన దీక్షలకు ఇప్టూ రాష్ట్ర నాయకుడు గౌని నాగేశ్వరరావు, బూర్గంపహాడ్ ఏరియా అధ్యక్ష, ఉపాధ్యక్షులు వైఎస్.రెడ్డి, బర్ల రామకృష్ణ, బీపీఎల్ ట్రాక్టర్ డ్రైవర్ల నాయకులు మల్లేష్, రాము, రవితో పాటు ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకుడు మారం వెంకటేశ్వరరెడ్డి మద్దతు పలికి కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం జేఏసీ నాయకులు 7వ రోజు నిరసన దీక్షలో భాగంగా ఏ, జనరల్, బీ షిఫ్ట్ ల్లో విధులకు వెళుతున్న కార్మికులకు నల్లబ్యాడ్జీలు ధరింపచేసి వినూత్న నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడు రోజులుగా నిరసన దీక్ష చేపట్టినా ఐటీసీ యాజమాన్యం కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు రాలేదన్నారు. కార్మికుల సంక్షేమం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని, సమస్య పూర్తిస్థాయిలో పరిష్కారమయ్యేంత వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని వారు హెచ్చరించారు. మున్ముందు నిరసన దీక్షను మరింత ఉధృతం చేస్తామని, తక్షణమే యాజమాన్యం గుర్తింపు సంఘంతో కలిసి పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని, కార్మికుల న్యాయమైన కోర్కెలు తీర్చాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన దీక్షా కార్యక్రమంలో కుమ్మరికుంట్ల రాంబాబు, రెంటాల కృష్ణ, ఆకిని చందర్రావు, జేఏసీ సభ్యులు ఆకిని సర్వేశ్వరరావు, కాలువ మోహన్, కాంట్రాక్టు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఐటీసీ యాజమాన్యం దిగొచ్చేంత వరకు పోరాటం ఆగదు