బూర్గంపహాడ్, మార్చి 25 : కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించేంతవరకు పోరాటం ఆగదని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం మూడో రోజుకు చేరాయి. శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో దీక్షా శిబిరాన్ని తొలగించాలని పోలీసు అధికారులు ఆదేశాలు ఇచ్చారని.. తమ సమస్యల కోసం పోరాటం చేస్తుంటే ముఖ్యమంత్రి పర్యటన కోసం దీక్షా శిబిరాన్ని తొలగించాలని చెప్పడం భావ్యం కాదని, ఐటీసీ యాజమాన్యం సమస్యలు పరిష్కరించేంత వరకు దీక్షలు కొనసాగిస్తామని వారు తేల్చి చెప్పారు. రిలేదీక్షా శిబిరంలో కార్మికులకు ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు మారం వెంకటేశ్వరరెడ్డి మద్దతు పలికారు. ఈ రిలే దీక్షల కార్యక్రమంలో కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రారెడ్డి, బెల్లం నాగయ్య, షేక్ యాకూబ్పషాలతో పాటు జేఏసీ మెంబర్లు పూనెం సురేంద్ర, సూరిశెట్టి జగదీష్, రామశెట్టి లక్ష్మి, మేకల శేషమ్మ, డేగల రవి, కందాల వెంకటరెడ్డి, పిల్లి ప్రభాకర్‌రావు, ఆకిలి చంద్రారావు, చుక్కపల్లి బాలాజీ పాల్గొన్నారు.