టేకులపల్లి, మే 31 : నకిలీ విత్తనాలు రైతులకు విక్రయించాలని చూస్తే కఠిన చర్యలు ఉంటాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వేల్పుల బాబురావు అన్నారు. శనివారం టేకులపల్లి మండల కేంద్రంలో స్థానిక వ్యవసాయ శాఖ అధికారి అన్నపూర్ణతో కలిసి విత్తన దుకాణాలను, సొసైటీని తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా ప్రతి షాప్‌లో రికార్డులను పరిశీలించారు. స్టాక్ వచ్చినప్పుడు నమోదు చేయాలని, ప్రతిరోజు సేల్స్ వివరాలు నమోదు చేయాలని, ప్రతి షాపు ముందు ధరల పట్టి, స్టార్ట్ బోర్డు ఏర్పాటు చేయాలని, రైతుకి ఇచ్చే బిల్లులో విత్తన తయారీ డేట్, సీడ్ బ్రాంచ్ కోడ్ స్పష్టంగా రాయాలని, రైతుల సంతకాలు, తేదీ స్పష్టంగా రాయాలని సూచించారు.
గతంలో నకిలీ విత్తనాలు పలుమార్లు టేకులపల్లి మండలంలో పట్టుపడ్డాయని, రైతులను మోసగిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నకిలీ విత్తనాలు అమ్మినట్లుగా తెలిస్తే వ్యవసాయ శాఖ లేదా పోలీస్ అధికారులకు తెలుపాలన్నారు. నకిలీ విత్తనాలతో పట్టుపడ్డ వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. అలాగే సీడ్‌ను నిల్వ చేసి రేటు పెంచాలని చూస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ అన్నపూర్ణ, ఏఈఓలు ప్రవీణ్, శ్రావణి పాల్గొన్నారు.