పాల్వంచ, ఏప్రిల్ 02 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని వేలం వేయడాన్ని అలాగే విద్యార్థుల అక్రమ అరెస్టును ఖండిస్తూ పాల్వంచలోని అంబేద్కర్ సెంటర్లో సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి వదిన పొదిల తులసీరాం మాట్లాడుతూ.. విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2003లో అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడు 300 ఎకరాల భూమిని అక్రమంగా పెట్టుబడిదారులకు పరిశ్రమల పేరుతో అందజేయడం జరిగిందని, కానీ దానిలో పరిశ్రమలను పెట్టకపోవడంతో ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ భూమిని న్యాయస్థానాల ద్వారా స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.
ఈ క్రమంలో ఆ భూమిని తిరిగి యూనివర్సిటీకి అప్పజెప్పకుండా ఉండటం వల్ల ఇప్పుడు దాన్ని సాకుగా తీసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తు వాటిని అమ్మాలని ప్రయత్నిస్తున్నదని దుయ్యబట్టారు. దీన్ని వ్యతిరేకించిన విద్యార్థులను జైలుపాలు చేయడం ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ భూమిని తిరిగి యూనివర్సిటీకి అప్పజెప్పి విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యవర్గ సభ్యులు కె.సత్య, ఎస్కే. నిరంజన్, సీనియర్ నాయకులు షేక్. రహీం, భాషా నారాయణ, సోమలింగం, గుర్రం రాములు, యాకూబ్, కళ్యాణ్, గట్టయ్య పాల్గొన్నారు.