రుద్రంపూర్, జూన్ 11 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం ధన్బాద్ గ్రామ పంచాయతీ పరిధిలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్, రుద్రంపూర్కు చెందిన సీనియర్ విద్యార్థి ఎ.జనతన్ రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల 9, 10 తేదీల్లో భద్రాచలంలో నిర్వహించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా బాక్సింగ్ పోటీల్లో ఎ.జనతన్ విశిష్ట ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించాడు. ఈ నెల 13, 14 తేదీలలో హైదరాబాద్లో జరగనున్న రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలలో అతను పాల్గొననున్నాడు. విద్యార్థి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ బ్రదర్ రాజశేఖర్ రెడ్డి విద్యార్థిని అభినందిస్తూ, భవిష్యత్లో జాతీయ స్థాయి పోటీలలో కూడా రాణించి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే విద్యార్థికి శిక్షణ అందించిన కోచ్లు, సహకరించిన తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ విజయం పాఠశాల విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని, క్రీడారంగంలో మరింత మంది విద్యార్థులు ముందుకు రావడానికి దోహద పడుతుందని ఆయన పేర్కొన్నారు.