రామవరం, సెప్టెంబర్ 18 : క్రీడలు మనకు కష్టపడితే విజయం తథ్యమనే సత్యాన్ని తెలియజేస్తాయని కొత్తగూడెం టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి.ప్రతాప్ అన్నారు. గురువారం చుంచుపల్లి మండలం, ధన్బాద్ పంచాయతీ పరిధిలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో SGF (School Games Federation) ఆధ్వర్యంలో నిర్వహించే కొత్తగూడెం జోనల్ స్థాయి పాఠశాలల ఆటల పోటీలు – 2025 ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి సీఐ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఈ పోటీలు ఉపయోగపడతాయన్నారు. జయాపజయాలకు అతీతంగా ప్రతిభ కనబరిచే వేదికగా వీటిని పరిగణించాలన్నారు.
చుంచుపల్లి ఎంఈఓ బాలాజీ మాట్లాడుతూ.. పోటీలను గ్రామీణ యువతలో ఆటల పట్ల ఆసక్తి పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెండు రోజుల పాటు కొనసాగే ఈ పోటీల్లో చుంచుపల్లి, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, టేకులపల్లి, కొత్తగూడెం మండలాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెయింట్ జోసెఫ్ హై స్కూల్ బ్రదర్ రాజశేఖర్ రెడ్డి, పీఈటీ కవిత, పృథ్వీ పాల్గొన్నారు.
Ramavaram : క్రీడలతో కష్టే ఫలి తత్వం అవగతం : సీఐ ప్రతాప్