– జడ్పీ సీఈఓ నాగలక్ష్మి
బూర్గంపహాడ్, జూన్ 04 : ప్రజా సమస్యలను పరిష్కరించి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ సీఈఓ నాగలక్ష్మి అన్నారు. గురువారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని ఇరవెండి గ్రామంలో సర్పంచ్ గుండి బాబూరావు అధ్యక్షతన గ్రామ సభ ఏర్పాటు చేయగా ముఖ్య అతిధిగా పాల్గొన్న జడ్పీ సీఈఓ మాట్లాడుతూ.. ప్రధానంగా రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల ఎంపికకు సంబంధించి గ్రామ సభలో పాలకవర్గం తీర్మానం చేయడంతో పాటు తడి, పొడి చెత్తలో నాలుగు రకాలు ఎలా వేరుచేయాలో ప్రజలకు అవగాహన కల్పించారు. మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై గ్రామ సభలో చర్చించారు.
గ్రామంలో నెలకొన్న సమస్యలను ప్రజల నుంచి నేరుగా తెలుసుకుని పరిష్కారానికి ఆయా శాఖల అధికారులను తక్షణం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామాభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాల మెరుగుదల సంక్షేమ పథకాల అమలు అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం జడ్పీ సీఈఓని సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులు శాలువాతో సత్కరించారు. ఈ గ్రామ సభలో మాజీ ఎంపీటీసీ వల్లూరిపల్లి వంశీకృష్ణ, ఉప సర్పంచ్ మహంకాళి రామారావు, ఈజీఎస్ ఏపీఓ విజయలక్ష్మి, వ్యవసాయ శాఖ, ఐసీడీఎస్, మిషన్ భగీరథ, విద్యాశాఖకు చెందిన అధికారులు, ఉపాధ్యాయులతో పాటు అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, వీఆర్ఓ, ఆశాలు, గ్రామస్తులు పాల్గొన్నారు.