చుంచుపల్లి అక్టోబర్ 2: రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెంలోని విద్యానగర్ కాలనీ హనుమాన్ ఆలయం సమీపంలో ప్రధాన రహదారి వద్ద చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. వేపలగడ్డకు చెందిన రొంకు సత్యనారాయణ (27) హైదరాబాద్‌లోని విప్రో కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. వర్క్‌ఫ్రం హోమ్‌లో భాగంగా స్వగ్రామానికి వచ్చిన ఆయన గురువారం రాత్రి పనినిమిత్తం కొత్తగూడెం వచ్చి తిరిగి అర్ధరాత్రి సమయంలో ఇంటికి వెళ్తున్నాడు.
విద్యానగర్ కాలనీ హనుమాన్ ఆలయం సమీపంలో ఎదురుగా వచ్చిన కుక్కను తప్పించబోయి ద్విచక్రవాహనంతో డివైడర్‌ను ఢీకొట్టి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. చేతికందిన కుమారుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎస్ఐ రవికుమార్ తెలిపారు.