జూలూరుపాడు, మార్చి 24 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూములు ఇచ్చిన రైతులను విస్మరించి రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనం కోసం పక్క జిల్లా ఖమ్మంకు నీటిని తరలించుకుపోవడాన్ని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు తీవ్రంగా ఖండించారు. జూలూరుపాడు మండలంలోని సీతారామ ప్రాజెక్ట్ పనులను పార్టీ నాయకులు, రైతులతో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. భూములు కోల్పోయిన భద్రాద్రి జిల్లా రైతులకు నీరు అందించకుండా పక్క జిల్లాకు నీటిని తరలించడాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతాంగం కళ్లల్లో కారం కొట్టి సీతారామ ప్రాజెక్ట్ నీళ్లను తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఖమ్మం జిల్లాకు తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. దుమ్ముగూడెం ప్రాజెక్ట్ మొదలుకుని నేటి సీతారామ ప్రాజెక్ట్ దాకా ఈ జిల్లా రైతాంగానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతోందన్నారు.
ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కొంతమంది ఈనాటి మంత్రులు ఉన్నారు. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతాంగానికి ఒరిగిందేమీ లేదు. తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సాగర్ ఆయకట్టు స్థిరీకరణ పేరుతో ఈ జిల్లా రైతులకు అన్యాయం చేస్తున్నట్లు చెప్పారు. ముందుగా ఈ జిల్లాలో రైతాంగానికి సాగునీరు అందించిన తర్వాతే మిగులు జలాలను మాత్రమే సాగర్ ఆయకట్టు స్థిరీకరణకు వినియోగించాలన్నారు. అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం సీతారామ ప్రాజెక్ట్ పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంచి 2023 ఆగస్టు 15న రాష్ట్ర ముఖ్యమంత్రి అశ్వరావుపేట దగ్గర కెనాలను ప్రారంభం చేశారు. 2024 ఫిబ్రవరిలో సాగర్ ఆయకట్టు స్థిరీకరణ పేరుతో రాష్ట్ర వ్యవసాయ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభం చేశారు కానీ భూసేకరణ చేసినటువంటి రైతాంగానికి నేటికి నష్టపరిహారం ఇవ్వలేదు. ఈ జిల్లాకు ఉపయోగించాల్సిన నీళ్లను ఇవ్వకుండా ఎక్కడా పిల్ల కాలువలు తీయకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు, జూలూరుపాడు మండలానికి అన్యాయం చేస్తుందన్నారు.
ఇప్పటికైనా ఈ జిల్లా రైతాంగానికి నీరు ఇచ్చిన తర్వాతనే మిగులు జలాలు మాత్రమే సాగరాయకట్టు స్తిరీకరణకు తీసుకువెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేశ్, అన్నవరపు కనకయ్య జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే బ్రహ్మచారి, రేపాకుల శ్రీనివాసరావు, జిల్లా కమిటీ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ, పార్టీ మండల కార్యదర్శి యాస నరేశ్, మండల కమిటీ సభ్యులు గార్లపాటి వెంకటి, గడిదేసి కనకరత్నం, రాచబంటి కోటేశ్వరరావు, జల్లిక రాధాకృష్ణ, శాఖ కార్యదర్శి బొల్లి లక్ష్మయ్య, బోడ అభిమిత్ర, దారావత్ రమేశ్, సత్యనారాయణ పాల్గొన్నారు.