– ఐటీడీఏ పీఓ, ఆర్డీఓ, బూర్గంపహాడ్ తాసీల్దార్‌కు వేపలగడ్డ గిరిజన రైతుల వినతి
బూర్గంపహాడ్, మే 12 : పీసా చట్టం, గ్రామసభ తీర్మానం లేకుండా తమ భూముల మీదుగా సీతారామ ప్రాజెక్టు పిల్ల కాల్వలు తీసేందుకు సర్వే నిర్వహించడం పట్ల బూర్గంపహాడ్ మండల పరిధిలోని వేపలగడ్డ గిరిజన రైతులు ఆదివాసీ మండల నాయకుడు మెండి భాస్కర్‌తో కలిసి మంగళవారం భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో పీఓ రాహుల్, ఆర్డీఓ, బూర్గంపహాడ్ తాసీల్దార్ కేఆర్కే ప్రసాద్‌ను వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు సమర్పించారు. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన పిల్ల కాల్వలు తమ భూముల మీదుగా వెళ్లనీయకుండా నిలుపుదల చేసి న్యాయం చేయాలని ఆ వినతిలో అధికారులను కోరారు. జనవరి 2026 నుంచి రైతులకు ఎలాంటి సమాచారం, పీసా చట్టం, గ్రామసభ తీర్మానం లేకుండా సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి పిల్ల కాల్వలు తీయడానికి గ్రామంలో భూముల సర్వే నిర్వహిస్తున్నారని ఆరోపించారు.
ఇప్పటికే తమకు ఉన్న భూమిలో కొంత మేరకు సీతారామ ప్రాజెక్టు కాలువ, కిన్నెరసాని కాలువల కోసం ఇచ్చామని, ఇప్పుడు ఎకరం, అరెకరం మాత్రమే కలిగి ఉన్న భూముల్లో పిల్ల కాలువలు అవసరం లేదని, దీనివల్ల తమ భూములకు నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సర్వేను నిలిపివేసి భూములు కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. దీనికి ఐటీడీఏ పీఓ స్పందించి గ్రామంలో పీసీ చట్టం, గ్రామ సభ నిర్వహించి గిరిజన రైతుల భూములు నష్ట పోకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.