కొత్తగూడెం గణేష్ టెంపుల్, జూలై 13 : ఎస్ ఐ ఆర్ ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా వేగవంతంగా పూర్తి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. సోమవారం ఆయన కొత్తగూడెం తాసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) హెల్ప్‌డెస్క్‌ను పరిశీలించారు. కొత్తగూడెం పరిధిలోని 66 పోలింగ్ కేంద్రాల్లో బీఎల్వోలు ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నారా, ఓటర్లు నింపిన ఫారాలను తిరిగి స్వీకరిస్తున్నారా అని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఫారాల పంపిణీ, స్వీకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు.
బీఎల్వోలు సేకరించిన ఫారాలను ఎప్పటికప్పుడు డిజిటలైజ్ చేయాలని, డిజిటలైజేషన్ ప్రక్రియను ఆపరేటర్లు అత్యంత అప్రమత్తంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని సూచించారు. డిజిటలైజేషన్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.
ఓటర్లకు ఫారాలు పూరించే విధానంపై అవగాహన కల్పిస్తూ అవసరమైన సహాయ సహకారాలు అందించాలని, ఇంటి వద్ద అందుబాటులో లేని ఓటర్లను ఫోన్ ద్వారా సంప్రదించి వివరాలు సేకరించి వారికి ఫారాలు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. బీఎల్వోలు తమకు కేటాయించిన పరిధిలో అందుబాటులో లేని ఓటర్ల వివరాలను సంబంధిత బీఎల్వో సూపర్వైజర్లకు వెంటనే తెలియజేసి, ఫారాల పంపిణీ ప్రక్రియను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. తాసీల్దార్ పుల్లయ్య మాట్లాడుతూ.. కొత్తగూడెం పరిధిలో 66 పోలింగ్ కేంద్రాలు ఉండగా, వాటి పర్యవేక్షణకు ఏడుగురు బీఎల్వో సూపర్వైజర్లు విధులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌కు వివరించారు.