రామవరం, ఆగస్టు 02 : మందమర్రి కేకే 5 గని ప్రమాదంలో రాసపల్లి శ్రావణ్ కుమార్ (32) మృతి చెందడం బాధాకరమని ఏఐటీయూసీ కార్యదర్శి హుమాయూన్ అన్నారు. శనివారం సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని పీవీకే 5 ఇంక్లైన్ గనిలో శ్రావణ్‌కుమార్ సంతాప సభను నిర్వహించారు. ముందుగా శ్రావణ్ మృతికి సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సంతాప సభలో హుమాయూన్ మాట్లాడుతూ.. శుక్రవారం రెండో షిప్ట్‌లో జరిగిన ప్రమాదంలో సింగరేణి యువ కార్మికుడు శ్రావణకుమార్ మృతి చెందడం చాలా విషాదకరం అన్నారు.
రామకృష్ణాపూర్కి కి చెందిన శ్రావణ్ జనరల్ అసిస్టెంట్, యాక్టింగ్ SDL ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న క్రమంలో సాయంత్రం 6 గంటల సమయం లో SDL యంత్రం మొరాయించడంతో దాన్ని పరిశీలిస్తుండగా, 20 డిప్ 32 అప్ లెవల్ వద్ద ఆకస్మికంగా సైడ్ వాల్ కూలడంతో బొగ్గు పొరలకు, SDL యంత్రానికి మధ్యలో ఇరుక్కుపోయిన శ్రావణ్ కుమార్‌ను హుటాహుటిన తోటి కార్మికుల సాయం తో రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడం తో అక్కడినుండి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపాడు.
శ్రావణ్ యువ కార్మికుడు కావడంతో వారి కుటుంబానికి మానిటరీ బెనిఫిట్స్ సరిగ్గా అందవు కాబట్టి, తమ వంతు బాధ్యతగా ఆ కుటుంబానికి ఆర్థిక చేయూత ఇద్దామని ప్రతిపాదించగా అంతా సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో గని మేనేజర్ శ్యామ్ ప్రసాద్, సంక్షేమ అధికారి షకీల్, రక్షణ అధికారి కిశోర్, ఏఐటీయూసీ యూనియన్ నాయకులు పిట్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.నాగేశ్వరరావు, అసిస్టెంట్ పిట్ కార్యదర్శి సాయిపవన్, భుక్య రమేశ్, కర్రు రమేశ్, బండి వెంకటరమణ, శ్రీనివాస్, శ్రీధర్, కుమారకృష్ణ, డివి రమణ, క్రాంతి, ఐఎన్టీయూసీ పీట్ కార్యదర్శి చిలుక రాజయ్య, తాతిదారులు పాల్గొన్నారు.