– రూ.48 వేల కోట్ల బకాయిలతో సింగరేణి సంక్షోభంలోకి నెట్టేశారు
– యూనియన్ ఎన్నికలు వెంటనే నిర్వహించాలి
రామవరం, జనవరి 08 : సింగరేణి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఏటీఎంగా వాడుకుంటూ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతుందని టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఉజ్వల భవిష్యత్‌కు సింగరేణి సంస్థను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. గురువారం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో 30 వేల మంది యువకులకు తాము ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. అదే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ఉద్యోగాల జాడేదని విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ.19 వేల కోట్లు మాత్రమేనని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రూ.24 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సిన స్థితి వచ్చిందన్నారు.
సింగరేణి రక్షించడానికి, కార్మికులకు జీతభత్యాలు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.48 వేల కోట్ల బకాయిలను తక్షణమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణి గుర్తింపు యూనియన్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాలు మెడికల్ బోర్డు ప్రతి నెలలో రెండు పర్యాయాలు నిర్వహిస్తామని చెప్పి గడిచిన 10 నెలల్లో ఒక్క బోర్డు కూడా నిర్వహించలేదని దుయ్యబట్టారు. వేలాది మంది కార్మికులు, వారి కుటుంబాలు తీవ్ర ఆందోళన, అశాంతి, గందరగోళంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి గుర్తింపు యూనియన్ ఎన్నికల కాల పరిమితి ముగిసినందున తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. యాజమాన్యంతో జరిగే సంప్రదింపులకు అన్ని కార్మిక సంఘాలకు అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి, చీఫ్ జనరల్ సెక్రెటరీ కాపుకృష్ణ, ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమురయ్య, అధికార ప్రతినిధి పర్లపల్లి రవి, కోశాధికారి చెల్పూరి సతీష్, కేంద్ర ఉపాధ్యక్షుడు మెడికల్ సంపత్ కుమార్, మంగీలాల్, కూసన వీరభద్రం, ప్రభాకర్ రెడ్డి, సదానందం, 11 డివిజన్ల ఉపాధ్యక్షులు వడ్డేపల్లి శంకర్, ఐలి శ్రీనివాస్, నాగెల్లి సాంబయ్య, మల్రాజు శ్రీనివాసరావు, మేడిపల్లి సంపత్, బండి రమేష్, బడితల సమ్మయ్య, నాగేల్లి వెంకటేశ్వర్లు, గడప రాజయ్య, తుమ్మ శ్రీనివాసరావు, జాఫర్ హుస్సేన్ పాల్గొన్నారు.

Ramavaram : కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏటీఎంలా సింగరేణి : కొప్పుల ఈశ్వర్