– కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు
రుద్రంపూర్, మే 11 : యువత అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని పోటీ పరీక్షల్లో విజయాలు సాధించాలని, క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర శ్రమతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు అన్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతకు ప్రోత్సాహం అందించేందుకు సింగరేణి కొత్తగూడెం ఏరియా యాజమాన్యం మరో ముందడుగు వేసింది. రుద్రంపూర్ సీఈఆర్ క్లబ్లో ఏర్పాటు చేసిన స్టడీ రూమ్లో చదువుతున్న అభ్యర్థులకు అవసరమైన పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం జీఎం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా జీఎం షాలెం రాజు అభ్యర్థులకు స్వయంగా పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత అభివృద్ధికి సింగరేణి సంస్థ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని తెలిపారు.
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు, వారికి అవసరమైన అధ్యయన వాతావరణాన్ని కల్పించేందుకు స్టడీ రూమ్లు, పుస్తకాల పంపిణీ కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా అభ్యర్థుల భవిష్యత్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడంలో జీఎం శాలెం రాజు తీసుకున్న ప్రత్యేక చొరవను యూనియన్ నాయకులు అభినందించారు. అభ్యర్థులకు మెరుగైన అధ్యయన వాతావరణం కల్పిస్తూ సింగరేణి యాజమాన్యం అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ టు జీఎం కోటిరెడ్డి, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ ముక్కపాటి వెంకటేశ్వర్లు, పర్సనల్ మేనేజర్ తిరుపతి, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి వి.మల్లికార్జున రావు, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండీ.రజాక్, ఐఎన్టీయూసీ పిట్ కార్యదర్శి సాగర్, ఇతర అధికారులు, అభ్యర్థులు పాల్గొన్నారు.