రామవరం, ఆగస్టు 04 : సొంతింటి కల నెరవేర్చలేకపోవడం, ఇన్‌కం ట్యాక్స్ రద్దు చేయించక పోవడం, మారు పేర్ల సమస్యను తీర్చలేకపోవడం ఇలా ఒక్కటేమిటి అన్ని సమస్యల పరిష్కారంలో గుర్తింపు ప్రాతినిథ్యం వహిస్తున్న సింగరేణి కార్మిక సంఘాలు విఫలం చెందాయని హెచ్ఎంఎస్ జనరల్ సెక్రెటరీ రియాజ్ అహ్మద్ తెలిపారు. సోమవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని పీవీకే 5 ఇంక్లైన్ గని వద్ద హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి హెచ్ఎంఎస్ అధ్యక్షుడు తిప్పారపు సారయ్య, రియాజ్ అహ్మద్ పాల్గొని మాట్లాడారు. దాదాపు ఏడు సంవత్సరాలుగా కొత్తగూడెం ఏరియాలో సర్ఫేస్ కౌన్సిలింగ్ నిర్వహించకపోతే పలుమార్లు వినతి పత్రాలు అందజేసినా మేనేజ్మెంట్ వైఖరిలో మార్పు లేకపోవడం వల్ల, లోపభూయిష్టమైన సర్కులర్లతో కార్మిక వర్గాన్ని అన్యాయం చేస్తూ మేనేజ్మెంట్ చేపట్టే చర్యలకు వ్యతిరేకంగా హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించి కార్మికులకు తెలియజేయడం జరిగిందన్నారు.
గుర్తింపు ఏఐటీయూసీ, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీ వైఫల్యాల కారణంగా కార్మికులు పలు రకాల ఇబ్బందులకు గురికావడం జరుగుతుందన్నారు. ఎన్నికల సమయంలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేక మాయమాటలతో మభ్యపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. దానికి ఉదాహరణగా మేనేజ్మెంట్తో అగ్రిమెంట్ చేశామని చెప్పినా తెల్లారే క్యాంటీన్లు ప్రైవేట్ పరం చేయడం, మెడికల్‌లో అన్‌ఫిట్ చేసి సర్ఫేస్‌లో సూటబుల్ జాబ్ ఇవ్వకుండా డెసిగ్నేటెడ్ కార్మికులను జనరల్ అసిస్టెంట్ ఫస్ట్ కేటగిరి చేయడం, పారదర్శకత లేని పివికే సొసైటీ గురించి, ఇంక్రిమెంట్లు కల్పించడంలో విఫలం కావడం, రెండు కోటర్లు ఉన్నాయని సాకుతో ఒక కోటర్ హ్యాండ్ ఓవర్ చేసినా కార్మికుల జీతాల నుంచి పీనల్ రెంట్ రూపంలో విధించే కోత గురించి ప్రస్తావించడం, ఏళ్లు గడుస్తున్నా జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ నిర్వహించక పోవడం, వికే ఓ సి ప్రారంభించడంలో అలసత్వం ప్రదర్శించడం. డిప్యూటేషన్ల దందాను నిలిపి వేయించడంలో విఫలం కావడం, లాభాల వాటా ప్రకటించడంలో జాప్యం చేయడం, మెకానికల్ ఫోర్ మెన్లకు కన్ఫర్మేషన్ లెటర్లు అందించడంలో విఫలం కావడం, మైనింగ్ సూపర్వైజర్లకు పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్ కల్పించడంలో విఫలం కావడం, వంటి పలు రకాల సమస్యలతో సతమతమవుతున్నా పట్టించుకోకుండా కార్మిక గొంతుగా నిలవాల్సిన గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు ప్రేక్షక పాత్ర వహించడం వంటివి కార్మికులందరూ గమనించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, బ్రాంచ్ సెక్రటరీ ఆసిఫ్, పిట్ సెక్రెటరీ చిట్టిబాబు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ సందీప్, ఆర్ సి హెచ్ పి ఫీడ్ సెక్రటరీ పూర్ణచందర్, వర్క్ షాప్ పిట్ సెక్రటరీ అబ్దుల్ కరీం, కొత్తగూడెం ఏరియా కన్వీనర్ చంద్రశేఖర్, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ ప్రసాద్, అనిల్, రెడ్డి, కిరణ్, కార్పొరేట్ బ్రాంచ్ సెక్రటరీ యాకూబ్, ఇతర కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.