రామవరం, అక్టోబర్ 04 : దాదాపు పాతికేళ్ల తర్వాత తమ స్నేహితులు, చదువు చెప్పిన గురువులను చూసి పూర్వ విద్యార్థులు మురిసిపోయారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ సందడిగా గడిపారు. చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీ పరిధిలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో 1991-2001 సంవత్సరం పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని శనివారం రుద్రంపూర్ నాటి పాఠశాల నేటి సీఈఆర్ క్లబ్లో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా పాఠశాల ప్రాంగణంలోకి రాగానే ఒక్కసారిగా తమ పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు.
పాత స్నేహితులు అందరూ ఒక్క సారిగా కలవడంతో తమ ఆనందాలకు అవధులు లేకుండా గడిపారు. ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పి తమను ప్రయోజకులుగా చేసిన గురువులను ఆత్మీయ సత్కారం చేసి వారి ఆశీర్వాదాలను పొందారు. ఈ సందర్భంగా ఉన్నత స్థానాలకు ఎదిగిన తమ పూర్వ విద్యార్థులను చూసి గురువులు ఆనందించారు. జీవితంలో ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశీర్వదించారు. తమపై విద్యార్థుల ప్రేమాభినాలు ఎల్లప్పుడు ఉండాలని కోరుకున్నారు. విద్యార్ధినీ విద్యార్థులు ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విద్యార్ధి దశ గురువులతో మెలిగిన సందర్భాలను తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఉదయం నుండి సాయంకాలం వరకు ఉల్లాసంగా గడిపిన పూర్వ విద్యార్థులు తమ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ బరువెక్కిన హృదయాలతో తమ గమ్యస్థానాలకు బయలుదేరారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు, ఉపాధ్యాయులు దేవి దత్, శ్రీనివాస్, మూర్తి, మేకల రంగారెడ్డి, ఉపాధ్యాయునీలు సులోచన, సుభాషిని, విజయలక్ష్మి, మధురవాణి, జయ, రూత్, సమన్వయకర్తలు మనోజ్, రాజేష్, వెంకటేష్, సౌజన్య, లావణ్య, సతీష్, నవీన్, సుజాత, రాములు, కిరణ్, యుగంధర్, మహమూద్, ఓ.రాకేష్, స్వాతి, పూర్వ విద్యార్థుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Ramavaram : సింగరేణి ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం