రుద్రంపూర్, ఏప్రిల్ 10 : సింగరేణి సంస్థలో ఉద్యోగులకు క్వార్టర్ల కేటాయింపు సాధారణంగా పారదర్శకంగా, ముందస్తు నోటీసులతో నిర్వహించడం ఆనవాయితీ. కనీసం వారం రోజుల ముందు నోటీసు జారీ చేసి, ఆసక్తి గల ఉద్యోగులు దరఖాస్తు చేసుకునేలా కౌన్సిలింగ్ జరపడం సర్వసాధారణం. అయితే, సింగరేణి కొత్తగూడెం ఏరియాలో ఇటీవల క్వార్టర్స్ కౌన్సిలింగ్ గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించడం పట్ల ఉద్యోగుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీఎం కార్యాలయం వరకు మాత్రమే సర్క్యులర్ జారీ చేసి, మైన్స్, ఓపెన్ కాస్ట్, ఇతర విభాగాల్లో నోటీసు బోర్డుల్లో పొందపరచకుండా కౌన్సిలింగ్ నిర్వహించారని ఆరోపణలు వస్తున్నాయి.
ఇటీవల జీఎం కార్యాలయం సమీపంలో నిర్మించిన 60 ఎంసీ క్వార్టర్లను సాధారణంగా సూపర్వైజర్లు, క్లర్కుల్లో సీనియర్ అసిస్టెంట్లు, సీ, బీ,,‘ఏ ప్లస్’ గ్రేడ్ ఉద్యోగులకు సీనియార్టీ ప్రాతిపదికన కేటాయించాలి. కానీ శుక్రవారం నిర్వహించిన కౌన్సిలింగ్లో జీఎం కార్యాలయంలో పనిచేసే క్లర్కులకు 20 క్వార్టర్లు, బయట పనిచేసే నలుగురు క్లర్కులకు మాత్రమే పరిమిత కేటాయింపులు జరగడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
“జీఎం కార్యాలయంలో పనిచేసే వారికి ఒక న్యాయం, సాధారణ ఉద్యోగులకు మరో న్యాయమా?” అంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాదిరిగానే పారదర్శకంగా, సీనియార్టీ ప్రాతిపదికన కౌన్సిలింగ్ నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
జీఎం కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు సమీపంలో క్వార్టర్లు ఉంటే సౌలభ్యం ఉంటుందని ఒక అధికారి అనడంపై ఉద్యోగులు ఇదేం పద్ధతి అంటూ అసహనం వ్యక్తం చేశారు. వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్న విస్తరాకు నిండుతుంది అనే చందాన అధికారుల తీరు ఉందని మండిపడుతున్నారు కార్మిక సంఘాల నాయకులు. ఇప్పటికైనా అధికారులు ద్వంద్వ వైఖరిని వీడి, న్యాయంగా క్వార్టర్ల కేటాయింపు జరిపించాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఈ విషయమై ఏరియా పర్సనల్ డీజీఎం వెంకట మోహనరావును వివరణ కోరగా ,క్వార్టర్ కౌన్సిలింగ్ మీద డిస్కషన్ ఫైనల్ చేయలేదు. ఇంకా ఆలోచన చేయాలి. ఇంకా ఏమీ నిర్ణయం చేయలేదు. జిఎం కార్యాలయంలో పనిచేసే వారికి పక్కనే క్వార్టర్ ఉంటే సౌలభ్యంగా ఉంటుందని ఆలోచిస్తున్నాం అని చెప్పడం ద్వారా కార్మికుల ఆందోళన నిజమేనని స్పష్టమవుతోంది.