– డైరెక్టర్ (పి&పి) కె.వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ప్రారంభోత్సవం
రుద్రంపూర్, జూలై 20 : సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రామవరంలో ఆధునిక సౌకర్యాలతో పునరుద్ధరించిన సింగరేణి డిస్పెన్సరీని సోమవారం సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) కె.వెంకటేశ్వర్లు ఘనంగా పునఃప్రారంభించారు. అనంతరం వీకేసీఎం ప్రాజెక్టులో నూతనంగా కొనుగోలు చేసిన నాలుగు క్రేన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో డిస్పెన్సరీని ఆధునికీకరించి తిరిగి అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమంతో పాటు సంస్థ ఆధునికీకరణకు యాజమాన్యం నిరంతరం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంఓ) డా.కిరణ్ రాజ్ మాట్లాడుతూ.. డిస్పెన్సరీలో ఒక స్టాఫ్ నర్స్‌ను నిరంతరం అందుబాటులో ఉంచడంతో పాటు అవసరమైన వైద్య సేవలు, మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం రాజు మాట్లాడుతూ, రామవారంలో పునరుద్ధరించిన డిస్పెన్సరీ ద్వారా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో పాటు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయని, ఈ సదుపాయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వీకేసీఎం ప్రాజెక్టులో నూతనంగా కొనుగోలు చేసిన నాలుగు క్రేన్లను డైరెక్టర్ కె. వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ క్రేన్ల వినియోగంతో గని నిర్వహణ పనులు మరింత వేగవంతంగా, సమర్థవంతంగా సాగడంతో పాటు భద్రతా ప్రమాణాలు, ఉత్పాదకత పెరుగుతాయని ఆయన తెలిపారు. భారీ యంత్ర పరికరాల తరలింపు, నిర్వహణ పనులు సులభతరం కావడంతో ఉత్పాదకత పెంపులో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వికెసీఎం ప్రాజెక్టు ఆఫీసర్ ఎం.వి.నరసింహరావు, ఏరియా ఇంజినీర్ వి.రామకృష్ణ, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ మొక్కపాటి వెంకటేశ్వర్లు, డీజీఎం (ఐఈడీ) యోహన్, ఏఐటీయూసీ సెంట్రల్ సెక్రటరీ వంగా వెంకట్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మల్లికార్జున్ రావు, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండీ. రజాక్, ఎస్.ఓ. టు జీఎం ఎం. గోవిందరావు, సీఎంఓఏఐ జనరల్ సెక్రటరీ ఉపేందర్, పర్సనల్ మేనేజర్ తిరుపతి, ఇన్చార్జ్ హెచ్‌వోడీ (సివిల్) కె. రాజారాం, డీవైపీఎం హరీష్, ఏఐటీయూసీ అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ గట్టయ్య, ఐఎన్టీయూసీ ఫిట్ సెక్రటరీ సాగర్, అధికారులు, వైద్యాధికారులు, కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

రామవరంలో సింగరేణి డిస్పెన్సరీ పునఃప్రారంభం