– మృతుడు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుడు బానోతు విష్ణు
రుద్రంపూర్, సెప్టెంబర్ 15 : పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి కేక్ కట్ చేయాల్సిన ఆ యువకుడు కొద్ది క్షణాల్లోనే విగతజీవిగా మారాడు. వినాయక మండపంలో లైట్ ఏర్పాటు చేస్తున్న క్రమంలో విద్యుత్ ఘాతానికి గురై సింగరేణి కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందిన విషాద సంఘటన ఆదివారం రాత్రి చుంచుపల్లి మండలం ధన్బాద్ పంచాయతీ పరిధిలోని తండాలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ధన్బాద్ పంచాయతీ పరిధిలోని తండాకు చెందిన బానోత్ హరి–ఆశా దంపతుల కుమారుడు బానోతు విష్ణు (24). సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని ఆర్సీహెచ్పీలో ఓపెన్ ఏరియా క్లీనింగ్ విభాగంలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి తండా యువకులంతా కలిసి వినాయక విగ్రహాన్ని తీసుకొచ్చి మండపంలో ప్రతిష్ఠించారు. అనంతరం విగ్రహం కోసం విద్యుత్ దీపాన్ని ఏర్పాటు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ సరఫరా కావడంతో విష్ణు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అక్కడే ఉన్న స్నేహితులు అతడికి ప్రథమ చికిత్స అందించి కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ విష్ణు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి తండ్రి హరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తగూడెం టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
పుట్టినరోజు సందర్భంగా కొడుకు కేక్ కట్ చేయాల్సిన సమయంలో.. అతడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాల్సి రావడంతో తల్లి ఆశా కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. ‘‘కేక్ కోయాల్సిన నా కొడుకు శరీరాన్ని పోస్టుమార్టంలో కోస్తున్నారే..’’ అంటూ ఆమె రోదించిన తీరు హృదయాలను కలచివేసింది. కొడుకు పుట్టినరోజును ఆనందంగా జరుపుకోవాల్సిన కుటుంబం.. అతడి అంతిమయాత్రకు సిద్ధం కావాల్సి రావడం స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. యువకుడి మరణ వార్త తెలుసుకొన్న కొత్తగూడెం వ్యవసాయ కమిటీ చైర్మన్ లాల్ సింగ్, బీఆర్ఎస్ చుంచుపల్లి మండలాధ్యక్షుడు గూడేల్లి యాకయ్య, సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, బానోత్ రాందాస్, సలిగంటి శ్రీనివాస్, పూల రవీందర్, భూక్య రవి, రేషన్ డీలర్ అసోసియేషన్ ట్రెజరర్ బానోత్ బాలు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.