– డిండి ఎత్తిపోతల భూ సేకరణపై రైతుల ఆగ్రహం
– చింతపల్లిలో ప్రధాన రహదారిపై భారీ రాస్తారోకో
మాల్, సెప్టెంబర్ 15 : డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని, న్యాయమైన పరిహారం ఇవ్వలేని పక్షంలో భూసేకరణ ప్రక్రియను తక్షణమే నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. మంగళవారం చింతపల్లి మండల కేంద్రంలోని హైదరాబాద్–నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారిపై భూములు కోల్పోతున్న రైతుల ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఇరిగేషన్ ప్రాజెక్టు డీఈకి వినతి పత్రం ఇవ్వడంతో పాటు చింతపల్లి తాసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు పెద్ద సంఖ్యలో రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రాజెక్టు కోసం భూములు కోల్పోతున్న రైతులకు సరైన పరిహారం అందించకుండా భూసేకరణ చేపట్టడం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పలువురు రైతులు మాట్లాడుతూ.. తరతరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న భూములను ప్రాజెక్టు కోసం కోల్పోతున్నామని తెలిపారు. భూములు కోల్పోయిన తర్వాత తమ కుటుంబాల జీవనాధారం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితులకు, భూముల విలువలకు అనుగుణంగా ఎకరాకు రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్‌ను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోతే భూసేకరణను ముందుకు సాగనివ్వబోమని స్పష్టం చేశారు. న్యాయమైన పరిహారం ఇచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.
రైతుల భారీ రాస్తారోకోతో హైదరాబాద్–నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారిపై కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైతుల ఆందోళనతో అధికారులు పరిస్థితిని పర్యవేక్షించారు. భూములు కోల్పోతున్న రైతుల సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి, ఎకరాకు రూ.50 లక్షల పరిహారంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని రైతులు కోరారు. ఈ నిరసనలో నట్వ గిరిధర్, ఎల్లంకి అశోక్, కొలుకులపల్లి కొండల్, ఆకుల శ్రీనివాస్, బి రాములు, వెంకట్ రెడ్డి, అనిల్, భాస్కర్, వీరయ్య, లింగం, అశోక్ పాల్గొన్నారు.