జూలూరుపాడు : ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు రోజుకు రూ.600 వేతనం ఇవ్వాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బానోతు ధర్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జూలూరుపాడు మండల పరిధిలో ఉపాధి పని ప్రదేశాలను అఖిలభారత ఐక్య రైతు సంఘం, అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రతినిధి బృందం శుక్రవారం సందర్శించి పరిశీలించింది. అనంతరం బానోతు ధర్మ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పని ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, టెంట్లు, మెడికల్ కిట్లు ఏర్పాటు చేయాలని, మంచినీటి సదుపాయం కల్పించడంతోపాటు మజ్జిగ ప్యాకెట్లు అందించాలని డిమాండ్ చేశారు.
పని ప్రదేశాల్లో అనారోగ్యానికి గురైన కూలీలకు ప్రభుత్వమే ఉచితంగా వైద్య సౌకర్యం కల్పించాలని ధర్మ కోరారు. పని పరికరాలైన గడ్డపారలు, పారలు, తట్టలు తక్షణమే ఉపాధి కూలీలకు ఉచితంగా అందజేయాలన్నారు. కూలీలకు పే స్లిప్పులను అందజేయాలని, అదేవిధంగా వారానికి ఒకసారి పేమెంట్ చెల్లించాలని డిమాండ్ చేశారు. కూలీలకు సరిపడా వేతనం అందించేందుకు ప్రభుత్వం, అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. వేసవికాలంలో వేసవి బోనస్ కింద 50% అదనంగా కలిపి చెల్లించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతు బీమా తరహాలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలని, దానికి ప్రభుత్వమే నిధులు సమకూర్చాలని కోరారు.
ఉపాధి హామీ పథకం పనిని రెండు వందల రోజులకు పొడిగించాలని, కూలీలకు కొలతలు లేకుండా వేతనాలు చెల్లించాలని ఆయన కోరారు. పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, వారి వేతనాలను నెలనెలా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉపాధి కూలీలకు గత సంవత్సరం రావాల్సిన పెండింగ్ వేతనాన్ని తక్షణమే చెల్లించాలని, లేనిపక్షంలో ఆందోళనలు చేపడుతామని ధర్మ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘ జిల్లా నాయకులు కంగాల వెంకటమ్మ, మండల నాయకులు పైదా వెంకటేశ్వర్లు, కల్తి శేఖర్, లింగాల రాములు, రమాదేవి, సునీత, చీమల శివకుమార్, కంగాల రంజిత్ కుమార్, నరసింహారావు, వసంత, సరోజిని సాగబోయిన రాములు, తాటి కృష్ణవేణి, నరేందర్, సాగర్, సరిత, ధనలక్ష్మి, ఉమా ఆదిలక్ష్మి, స్వరూప, నాగమణి తదితరులు పాల్గొన్నారు.