టేకులపల్లి, ఫిబ్రవరి 05 : పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల పట్ల సిబ్బంది బాధ్యతగా ఉండాలని ఇల్లెందు డీఎస్పీ వెంకన్న బాబు అన్నారు. గురువారం టేకులపల్లి పోలీస్ స్టేషన్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం అక్కడ ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా బాధ్యతగా మెలగాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లో వర్టికల్స్ వారీగా విధులు నిర్వర్తించే సిబ్బందిని ఒక్కొక్కరిగా వారి పనితీరు గురించి పరిశీలించారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా నిత్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. డయల్ 100 కు ఫోన్ రాగానే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు అండగా నిలవాలన్నారు. అలాగే పోలీస్ స్టేషన్లో పనిచేసే అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐ బత్తుల సత్యనారాయణ, టేకులపల్లి ఎస్ఐ రాజేందర్, సిబ్బంది పాల్గొన్నారు.