ములకలపల్లి : దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. తొలుత సావిత్రిబాయి పూలే చిత్రపటానికి సీడీపీవో రేవతి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ సావిత్రిబాయి పూలేని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. అమ్మాయిలను చదువుకు దూరం చేసిన ఆధిపత్య సంస్కృతిని ఎదిరించి తాను చదువుకోవడమే కాకుండా అమ్మాయిల కోసం మహిళా పాఠశాలను స్థాపించి చదువు చెప్పిన ఘనత సావిత్రిబాయి పూలేదని కొనియాడారు.
అంతేకాకుండా అనేక సేవా కార్యక్రమాలు చేసిన ఘనత కూడా ఆమెదేనన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు గజ్జల సందీప్, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు అనుముల సాయి,అంగన్వాడీ టీచర్లు సునీత, శోభారాణి, శ్రీలత, శివలక్ష్మి, సరస్వతి, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.