జూలూరుపాడు, మే 29 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పాలగుట్టపై స్వయంభూగా వెలసిన శ్రీ రుక్మిణీ సహిత సంతాన వేణుగోపాల స్వామి వారి మాస కల్యాణ మహోత్సవం శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవోపేతంగా జరిగింది. ఆలయ వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా ఈ కళ్యాణ క్రతువును నిర్వహించారు. స్వామి వారి మాస కల్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ మండపంలో ఏర్పాటు చేసిన పీటలపై ఆసీనులైన భక్తులు భక్తిపారవశ్యంతో కల్యాణ వేడుకను కనులారా తిలకించారు.
కాకర్ల గ్రామానికి చెందిన చావా వెంకట రామారావు – ఉమా వరలక్ష్మి దంపతులు కల్యాణోత్సవంలో పాల్గొని స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కల్యాణ మహోత్సవం అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ వేడుకలో ఆలయ కమిటీ చైర్మన్ ఢిల్లి వెంకటేశ్వర్లు, శ్రీకృష్ణ సేవా సమితి సభ్యులు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆలయ కమిటీ వారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను చేపట్టారు.

కాకర్ల పాలగుట్టపై వైభవంగా సంతాన వేణుగోపాల స్వామి మాస కల్యాణం