– మూలనపడ్డ పారిశుధ్య వాహనాలు
– వాహన మరమ్మతులకు కేటాయించిన నిధులు ఎక్కడ?
– నిర్మాణం పూర్తయినా నిరుపయోగంగా కమ్యూనిటీ హాళ్లు
– పారిశుధ్య వాహనాలకు సరిపడా డ్రైవర్లు ఉన్నారా ?
రామవరం, డిసెంబర్ 22 : కొత్తగూడెం కార్పొరేషన్లో పారిశుధ్య వాహనాల నిర్వహణ లోపం కారణంగా పట్టణంలో పారిశుధ్యం పడకేసిందని మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి మండిపడ్డారు. నగరంలో చెత్త తరలించే ఆటో ట్రాలీలు మరమ్మతులకు గురై మూలన పడ్డాయని చెప్పారు. చెత్త ట్రాలీలు మరమ్మతులకు గురవడంతో కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో పారిశుధ్య పనులు జరగడం లేదని తెలిపారు. నగరంలో కోతులు, కుక్కల బెడద ఎక్కువైందని వాటిని నివారించేందుకు మున్సిపల్ అధికార సిబ్బంది చర్యలు చేపట్టాలన్నారు. అలాగే కొత్తగూడెం మున్సిపాలిటీలో నిర్మాణం పూర్తయిన కమ్యూనిటీ హాళ్లను ఉపయోగంలోకి తేవాలన్నారు. ఇంకా ప్రతిపాదనలో ఉన్న కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలను చేపట్టాలని డిమాండ్ చేశారు.
పారిశుధ్య వాహనాల మరమ్మతుల కోసం ఏడాదికి లక్షలాది రూపాయల నిధులు వెచ్చిస్తున్నారని, అయినా నిర్వహణ లోపం కారణంగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయని విమర్శించారు. మూలనపడ్డ వాహనాలకు మరమ్మతులు చేసి పట్టణాన్ని శుభ్రపరిచే పని చేయడంలో కార్పొరేషన్ అధికార, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. అసలు పారిశుధ్య వాహనాలకు సరిపడా డ్రైవర్లు ఉన్నారా అని ఆమె ప్రశ్నించారు. వెంటనే మూలనపడ్డ పారిశుధ్య వాహనాలను బాగుచేసి కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో పేరుకుపోయిన చెత్తను శుభ్రపరచాలని ఆమె డిమాండ్ చేశారు.