– పడమట నర్సాపురం వద్ద రోడ్డు ప్రమాదం
– డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
జూలూరుపాడు, జూలై 14 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలో మంగళవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. పడమట నర్సాపురం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై లారీ, యాష్ ట్యాంకర్ వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో యాష్ ట్యాంకర్ ముందు భాగం నుజ్జునుజ్జు అవగా డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడుని విజయవాడ ఆస్పత్రికి తరలించారు.
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం కొండుగల గ్రామానికి చెందిన ఎన్.యూసుబ్ యాష్ ట్యాంకర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మంగళవారం పాల్వంచ నుంచి ట్యాంకర్లో యాష్ లోడ్ చేసుకుని జాన్‌పహాడ్ దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్తుండగా ఎదురుగా తల్లాడ వైపు నుంచి వస్తున్న ఇసుక లారీ అత్యంత వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు యాష్ ట్యాంకర్ ముందు భాగం క్యాబిన్ పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ఘోర ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్ యూసుబ్ కుడికాలు, కుడి చేయి పొట్ట భాగం తీవ్రంగా దెబ్బతిన్నాయి. నలిగిన క్యాబిన్ శిథిలాల మధ్యే చిక్కుకుపోయిన అతడు తీవ్ర రక్తస్రావంతో నొప్పి భరించలేక కాపాడాలంటూ పెద్దగా ఆర్తనాదాలు చేశాడు. డ్రైవర్ కేకలు విన్న స్థానికులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు.
సమాచారం అందిన వెంటనే 108 అత్యవసర సిబ్బంది, స్థానికులు కలిసి సమయస్ఫూర్తితో స్పందించారు. నలిగిపోయిన క్యాబిన్ లో ఇరుక్కుపోయి చావుబతుకుల్లో ఉన్న డ్రైవర్ యూసుబ్ను తీవ్ర శ్రమకోర్చి సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం ప్రాథమిక చికిత్స అందిస్తూ 108 వాహనంలో కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ ప్రాథమిక వైద్యం అందించిన అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం కుటుంబ సభ్యులు విజయవాడలోని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు.
ప్రధాన రహదారి మధ్యలోనే వాహనాలు ఢీకొనడంతో ఇరువైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రమాద సమాచారం అందిన వెంటనే జూలూరుపాడు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో జేసీబీని రప్పించి, ప్రమాదానికి గురైన వాహనాలను రోడ్డు పక్కకు తొలగించారు. అనంతరం ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.