– కొత్తగూడెం కార్పొరేషన్లో 2 నెలల నుంచి ఇబ్బందులు
– బిల్స్ అప్రూవల్ ఇవ్వక అవస్థలు పడుతున్న ఉద్యోగులు
– ప్రజా ప్రతినిధులు, కలెక్టర్‌కు గోడు వెళ్లబోసుకుంటున్న కార్పొరేషన్ సిబ్బంది
కొత్తగూడెం అర్బన్, ఆగస్టు 28 : కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలతో పాటు సుజాతనగర్‌లోని కొన్ని గ్రామాలను కలిపి నూతనంగా మే నెల చివరి వారంలో కొత్తగూడెం కార్పోరేషన్‌గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. కార్పొరేషన్ ఏర్పడ్డాక అభివృద్ధి జరుగుతుందని ప్రజలు, కొంత హెచ్ఆర్ పెరిగే అవకాశం ఉందని మున్సిపల్ ఉద్యోగులు సంతోషపడ్డారు. మొత్తంగా 170 మంది ఉద్యోగులు (మేనేజర్లు, డీఈలు, ఏఈలు, అకౌంట్స్ ఆఫీసర్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, వార్డు ఆఫీసర్లు, శానిటేషన్, పబ్లిక్ హెల్త్ ఉద్యోగులు, అటెండర్లు) విధులు నిర్వహిస్తున్నారు. కానీ కార్పొరేషన్ ఏర్పడ్డాక గడిచిన రెండు నెలలుగా ఉద్యోగులు జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీతాల కోసం కలెక్టర్ దృష్టికి, నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును సైతం కలిసి వేడుకున్నారు. కానీ ఫలితం శూన్యం. జిల్లా ట్రెజరీ కార్యాలయాధికారిని కలిసి జీతాలు ఇవ్వాలని ఉద్యోగులు కోరగా న్యూ క్యాడర్ స్ట్రెంత్ రానిదే తాము బిల్స్ చేయలేమని ఇబ్బందులు గురిచేస్తున్నారని, తమకు పై నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదని ట్రెజరీ శాఖాధికారులు చెబుతున్నట్లు కార్పొరేషన్ సిబ్బంది ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
ప్రతీ నెలా ఇంటి అద్దె, నెలసరి సరుకుల కొనుగోలు, పిల్లల ఫీజులు, ఇతరత్రా ఖర్చులు, ప్రతీ నెలా ఠంఛన్‌గా చెల్లించే వాయిదాలతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఉద్యోగులు తమ పిల్లల చదువుల కోసం రుణాలు, మరికొంత మంది హౌసింగ్ రుణం, వ్యక్తిగత రుణాలు తీసుకున్నవారు ఉన్నారు. బ్యాంక్ వాయిదాలను చెల్లించకపోతే చెక్ బౌన్స్ అవుతుందని, తద్వారా సిబిల్ స్కోర్ తగ్గుతుందని, మరికొంత మంది వేరే చోట వడ్డీలకు అప్పులు తీసుకువచ్చి చెల్లిస్తూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదిలోనే హంసపాదులాగా తొలుతనే జీతాల కోసం ఈ విధంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత రెండు నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నాం. జీతాలు ఇప్పించాలని జిల్లా అడిషనల్ కలెక్టర్‌ను, ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రాలు అందజేశాం. జిల్లా ట్రెజరీ శాఖ అధికారులను కలువగా తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదని, వస్తే బిల్స్ చేసి ప్రభుత్వానికి పంపుతామని చెబుతున్నారు. వెంటనే జీతాలు ఇప్పించే విధంగా ప్రభుత్వ ఉన్నతాధికారులు చొరవ చూపాలి.
Kothagudem Urban : జీతాలు ఇవ్వండి మహాప్రభో