రామవరం, జూన్ 24 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గల మైనారిటీ విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం సాయిరాం ఏజెన్సీ ఇచ్చిన నోటిఫికేషన్ తక్షణమే రద్దు చేయాలని జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా మంగళవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ద్వారా కాంట్రాక్ట్ దక్కించుకున్న సాయిరాం ఏజెన్సీ నిరుద్యోగుల నుండి దరఖాస్తులు స్వీకరించేందుకు శాశ్వత కార్యాలయాన్ని నేటి వరకు ఏర్పాటు చేయకుండా కొన్నేళ్లుగా పాల్వంచలో ఏజెన్సీని నిర్వహిస్తూ అధికారులను మభ్యపెడుతుందన్నారు. తాజాగా జిల్లాలోని పలు పాఠశాలలు, కళాశాలలో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల కోసం గురువారం ఓ దినపత్రికలో ప్రకటన విడుదల చేసిందని, ఈ ప్రకటన నందు శాశ్వత చిరునామా లేకపోవటం, గడువు తేదీ రెండు రోజులు మాత్రమే ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు.
పత్రికలోని క్లాసిఫైడ్ ప్రకటన చూసిన జిల్లాలోని నిరుద్యోగులు తమ దరఖాస్తులను పూర్తి చేసుకుని సదరు ఫోన్ నంబర్‌ను సంప్రదించగా స్పందన లేకపోవడంతో తీవ్ర నిరాశ చెందినట్లు తెలిపారు. మిగతా జిల్లాల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం జిల్లా కలెక్టరేట్ లోని ఆర్.ఎల్.సి కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తుండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం అందుకు భిన్నంగా ఏజెన్సీ వారు ఉద్యోగ ప్రకటన విడుదల చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు దృష్టి సారించి సాయిరాం ఏజెన్సీ కాంట్రాక్టు రద్దుచేసి, మరలా నియామక ప్రకటన జారీ చేసి నిరుద్యోగులకు అండగా నిలవాలని కోరారు.